Suriya : తెలుగు పైనే ఎక్కువ ఫోకస్ చేసిన సూర్య
తమిళ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అతని సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అప్పుడెప్పుడో గజినితో మొదలైన మార్కెట్ ను ఇప్పటికీ కాపాడుకుంటున్నాడు. నటుడుగానే కాక వ్యక్తిత్వంలోనూ ఆకట్టుకుంటాడు సూర్య. అందుకే అతనికి తమిళ్ లో ఎంతమంది అభిమానులున్నారో.. తెలుగులోనూ అంతేమంది అభిమానులున్నారు. అయితే కొన్నాళ్లుగా అతని సినిమాలు తెలుగులో విడుదల కావడం లేదు. కరోనా టైమ్ లో చేసిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ రెండూ ఓటిటికే పరిమితం అయ్యాయి. కరోనాకు ముందు వచ్చిన సినిమాలు తెలుగులో పెద్దగా ఆడలేదు. ఇప్పుడు దాదాపు రెండేళ్ల గ్యాప్ తరవాత కంగువతో వస్తున్నాడు. శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నవంబర్ 14న విడుదల కాబోతోంది.
కంగువతో ప్యాన్ ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నాడు సూర్య. ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసి చాలా రోజులే అవుతోంది. అయితే అతను తమిళ్, ఇతర భాషల కంటే తెలుగు మార్కెట్ పైనే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాడా అన్నట్టుగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా తిరుగుతున్నాడు. యూ ట్యూబ్ ఛానల్స్ కు కూడా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దీంతో రెండో రోజు ఫ్యాన్ మీట్ పెట్టాడు. దీనికి విపరీతంగా జనాలు వచ్చారు. ఇది చూసే అతనింకా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు. ఎలా చూసినా ఇప్పుడు ఇండియాలోనే టాలీవుడ్ చాలా పెద్ద మార్కెట్ గా మారింది. ఇక్కడి జనాలను ఎంటర్టైన్ చేస్తే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయి. అందుకే ఇంతకు ముందెప్పుడూ లేనంతగా తెలుగులో బాగా ప్రమోషన్స్ చేస్తున్నాడు సూర్య.విశేషం ఏంటంటే.. అతని సొంత రాష్ట్రం తమిళనాడులో కూడా ఈ రేంజ్ లో ప్రమోట్ చేయడం లేదు. ఈ మూవీతో తన రేంజ్ ఓ రేంజ్ లో మారుతుందని నమ్ముతున్నాడు సూర్య. అది టాలీవుడ్ నుంచే మొదలవుతుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. మరి అతని నమ్మకం నిజం అవుతుందా లేదా అనేది నవంబర్ 14న తేలుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com