మిల్కీ బ్యూటీ మెమరబుల్ డేస్.. పుట్టిన రోజు స్పెషల్

మిల్కీ బ్యూటీ మెమరబుల్ డేస్.. పుట్టిన రోజు స్పెషల్
పదిహేనేళ్లుగా ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతూ నేటికీ పదహారేళ్ల పడుచులానే కనిపిస్తోన్న ఎవర్ గ్రీన్ సోయగం తమన్నా..

అందం, ప్రతిభ కలిసిన అరుదైన నటి. పదహారణాల ప్రాయంలోనే వెండితెరపై అడుగుపెట్టి.. పదిహేనేళ్లుగా ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతూ నేటికీ పదహారేళ్ల పడుచులానే కనిపిస్తోన్న ఎవర్ గ్రీన్ సోయగం తమన్నా.. 'శ్రీ' మూవీతో శ్రీకారం చుట్టి.. కోలీవుడ్ లో అడుగుపెట్టి యువ హృదయాలను కొల్లగొట్టి.. తెలుగులో తనకు 'హ్యాపీడేస్' వచ్చాయంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేసింది.. పలు చిత్రాల్లో తమన్నానే హీరోయిన్‌గా పెట్టుకోవాలని నిర్మాతలు క్యూ కట్టారు. బాలీవుడ్ లోనూ ఫ్యాన్స్ ను సంపాదించుకున్న డ్యాన్సీ తమన్నా.. పాత్ర ఏదైనా 'హండ్రెడ్ పర్సెంట్ లవ్' తో చేయడం 'ఊసరవెల్లి'లా ఏ పాత్రలోకైనా ట్రాన్స్ ఫామ్ కావడం తమన్నాకే ప్రత్యేకం. పాలరాతి మేని సొగసు.. వెన్నలాంటి మనసూ ఉన్న తమన్నా పుట్టిన రోజు ఇవాళ.

పాత్రలను బట్టి టాప్ స్టార్స్ నుంచి చిన్న హీరోల సరసనా నటించిన హాట్ స్టార్ తమన్నా.. డ్యాన్స్ లతో రచ్చ చేస్తుంది.. పెర్ఫామెన్స్ తో రెబల్ గా మారుతుంది. అద్భుతమైన నటనతోనే కాదు అందాల ప్రదర్శనలోనూ అందె వేసిన చేయి. ఫైనల్ గా బాహుబలిని సైతం ఫిదా చేసి దటీజ్ తమన్నా అనిపించుకున్న బ్యూటీ. ఇన్నేళ్ల కెరీర్ లోనటిగా మేటి అనిపించుకున్న పాత్రలెన్నో తమ్మూ ఖాతాలో ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం తన పని అయిపోయిందన్నారు. కానీ రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు చేతినిండా సినిమాలతో అలా అన్నవారి నోళ్లు మూయించింది.

తమన్నా పుట్టింది ముంబైలో. ఎక్కడెక్కడో పుట్టిన అందగత్తెలంతా వెండితెరపై ముంబై ట్రైన్ ఎక్కేస్తారు. మరి అక్కడే పుట్టిన ఈ బ్యూటీకీ సినిమా చీమ కుట్టడంలో ఆశ్చర్యం ఏం ఉంది. అందుకే కేవలం పదహారేళ్ల వయసులోనే 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అదే ఏడాది తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'శ్రీ' సినిమా ఆకట్టుకోకపోయినా తమన్నా అందానికి మనవాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ వెంటనే ఆఫర్ రాలేదు.

తమిళ్ లో మాత్రం వెంట వెంటనే ఆఫర్స్ అందుకుంది తమన్నా. ఆ సినిమాలు కూడా హిట్ కావడంతో అక్కడే సెటిల్ అవుతుందనుకున్నారు. కానీ 2007లో శేఖర్ కమ్ముల 'హ్యాపీడేస్' లో తమ్మూని కొత్తగా పరిచయం చేశారు. ఆ సినిమా హిట్టవడంతో తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తుతాయనుకుంది. కానీ ఆమె ఆశ నిరాశే అయింది. అయితే తమిళంలో మాత్రం టాప్ లేపింది. తెలుగులో వచ్చిన మరో సినిమా 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం'తో తమన్నాకు గుర్తింపు పెరిగింది. కానీ '100పర్సెంట్ లవ్' తర్వాతే తమన్నా తెలుగులో పాగా వేయడం మొదలైందని చెప్పాలి.

ఆ వెంటనే వచ్చిన 'బద్రీనాథ్' తో స్టార్ హీరోల సరసన చోటు దక్కించుకుంది. ఆ సినిమా ఫ్లాప్ అయినా తమన్నా నటన, సోయగాలకు ప్రేక్షకులు పడిపోయారు. పరిశ్రమ సైతం మొదటిసారి తమన్నలోని కొత్త యాంగిల్ ను చూసింది. ఆ వెంటనే ఎన్టీఆర్ సరసన 'ఊసరవెల్లి'లో నటించింది. ఇది యావరేజ్ అయినా ఓ రకంగా తమన్నా నట విశ్వరూపం చూపించిందని చెప్పాలి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తన నటన సినిమాకే హైలెట్ అంటే అతిశయోక్తి కాదు.

టాప్ హీరోల సినిమాల్లో నటించినా తమన్నాపై ఓ ముద్ర వేశారు. ఆమె ఉంటే సినిమా ఆడదని. కానీ ఆ ట్యాగ్ ను చెరిపేస్తూ రామ్ చరణ్ సరసన నటించిన 'రచ్చ' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని 'వానా వానా వెల్లువాయే' పాటలో తమన్నా డ్యాన్స్ కు చరణ్ కూడా పోటీ పడాల్సి వచ్చింది. ఇక వరుసగా సినిమాలు. అన్నిట్లోనూ ఆమెకంటూ ఓ ప్రత్యేకత కనిపించేలా దర్శకులూ చూసుకున్నారు. 'ఎందుకంటే ప్రేమంట' సినిమాలో మరోసారి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది.

పవన్ కళ్యాణ్ సరసన 'కెమెరా ఉమెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటించి మెప్పించింది. అంతకు ముందే చేసిన 'రెబల్' లో తమన్నాకు ఇంటర్డక్షన్ సాంగ్ ఉంది. ఓ టాప్ హీరో సినిమాలో హీరోయిన్ కు ఇంటర్డక్షన్ సాంగ్ ఉండటం ఈ మధ్య కాలంలో తమన్నాకే జరిగిందేమో. ఆ సినిమా ఫ్లాప్ అయినా తమన్నా హిట్ అయిందనే చెప్పాలి. మరోవైపు హిందీలోనూ అడుగుపెట్టింది. ఇటు తమిళ్ లోనూ టాప్ హీరోల సరసనే నటిస్తూ దూసుకుపోయింది తమన్నా. తన పాత్ర ఏదైనా తమన్నా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తుందనే చెప్పాలి. తొలినాళ్లలో కేవలం స్కిన్ షోకే పరిమితమైనా.. లేదా మేకర్స్ అలా పరిమితం చేసినా.. నటనకు ఆస్కారం ఉండే ఏ ఛాన్స్ నూ వదులుకోలేదు. అలాగే హిమ్మత్ వాలా వంటి రీమేక్ లో శ్రీదేవి పాత్రలో మెప్పించే ప్రయత్నమూ చేసింది.

సౌత్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తో పాటు టాప్ హీరోయిన్ అనే స్టేటస్ తెచ్చుకుంది తమన్నా. ఈ గుర్తింపును ప్రపంచవ్యాప్తం చేసిన సినిమా బాహుబలి. ఫస్ట్ పార్ట్ లో తమన్నాను దర్శకుడు ప్రెజెంట్ చేసిన తీరుకి ప్రేక్షకులు ఆశ్చర్యపోయినా ఆ తర్వాత తను ఆ క్యారెక్టర్ ను ప్రెజెంట్ చేసిన విధానానికి మెస్మరైజ్ అయ్యారు. డీ గ్లామర్ రోల్ లో అదరగొడుతూనే.. పచ్చబొట్టేసిన పాటలో తన సోయగాలను పరచడంలోనూ పర్ఫెక్ట్ అనిపించుకుంది. బాహుబలి తర్వాత సక్సెస్ రేట్ కాస్త తగ్గిందనే చెప్పాలి.

అయితే స్పెషల్ సాంగ్స్ లో చేయమంటూ వచ్చిన ఆఫర్స్ ని వదులు కోలేదు. ఆ పాటలు తన ఇమేజ్‌ని మరింత పెంచాయి. ఆయా సినిమాలకు ప్రత్యేకతను తీసుకువచ్చింది తన డ్యాన్సులే. కొత్తతరం భామలు వస్తున్నప్పుడు యంగ్ హీరోలు ఆ వైపు చూడటం సహజం. దీంతో సీనియర్ హీరోయిన్ల ఛాన్స్ లూ తగ్గుతాయి. కానీ తమన్నా విషయంలో ఇది జరగడం లేదు. సరికదా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటోంది. వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. ప్రస్తుతం తమన్నా బ్యాగ్ లో ఒక హిందీ మూవీతో పాటు రెండు వెబ్ సిరీస్‌లు కూడా ఉన్నాయి. 15 ఏళ్ల కెరీర్.. 30 ఏళ్ల వయసు.. ఇలాగే ఉంటే మరి కొంత కాలం ఇండస్ట్రీలో తన హవా కొనసాగించగలదు.

ఏదేమైనా పూటకో హీరోయిన్ వచ్చే సినిమా పరిశ్రమలో పదిహేనేళ్లుగా కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేయడం అంత సులువైన విషయం కాదు. అందుకు డిసిప్లిన్, డెడికేషన్ ఎంతో కావాలి. ఆ రెండూ ఉన్నాయి కాబట్టి తమన్నా ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉండగలుగుతోంది. ఈ స్ట్రెంత్ ను ఇలాగే కంటిన్యూ చేస్తూ తమ్మూ మరింత కాలం ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదాం..

Tags

Read MoreRead Less
Next Story