VISHAL: విశాల్ ఆరోపణలపై విచారణ

సెన్సార్ బోర్డు కార్యాలయంలో లంచం వతారంపై నటుడు విశాల్ చేసిన ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ముంబయి సెన్సార్ బోర్డు కార్యాలయంలో అవినీతి పేరుకుపోయిందంటూ నటుడు విశాల్ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్రం విచారణకు ఆదేశించింది. సెన్సార్ బోర్డు కార్యాలయంలో గతంలో ఇంకా ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైతే ఆ సమాచారం విచారణాధికారితో పంచుకోవాలని కేంద్రం సూచించింది.
సెన్సార్ బోర్డులో అవినీతి జరిగినట్టు వార్తలు రావడం దురదృష్టకరమని, ఈ విషయాన్ని ఏమాత్రం సహించబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సమాచార, ప్రసార శాఖకు చెందిన అధికారిని ముంబయికి పంపినట్లు తెలిపింది. ఆయన విచారణ జరిపి నివేదిక సమర్పిస్తారని....కేంద్రం పేర్కొంది. ఎవరైనా లంచాలు తీసుకున్నట్లు తెలితే కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేసింది. సెన్సార్ బోర్డు కార్యాలయంలో అవినీతి, వేధింపులకు సంబంధించిన సమాచారం అందించాలని సినీపరిశ్రమ వర్గాలకు....కేంద్రం సూచించింది.
విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ చిత్రం హిందీ వర్షన్.... ఉత్తర భారతంలో గురువారం విడుదలైంది. ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ కోసం....తప్పనిసరి పరిస్థితుల్లో ఆరున్నర లక్షలు లంచం ఇవ్వాల్సి వచ్చిందని నటుడు విశాల్ ట్వీట్ చేశాడు. ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం శిందేను ట్యాగ్ చేయటం ద్వారా....ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాడు. డబ్బులు జమచేసిన బ్యాంకు ఖాతాల నెంబరు, సంబంధికుల పేర్లను కూడా విశాల్ పోస్ట్‌లో పెట్టాడు. సాంకేతిక కారణాల వల్ల ....మార్క్‌ఆంటోనీ హిందీ వర్షన్ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఆన్‌లైన్‌లో చివరి నిమిషంలో దరఖాస్తు చేసుకున్నట్లు విశాల్ తెలిపాడు. అయితే ముంబయి సెన్సార్ బోర్డు కార్యాలయంలో జరిగిన ఘటనతో తామంతా నిర్ఘాంతపోయినట్లు విశాల్ పేర్కొన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com