Asuran Actor: కోవిడ్ కాటుకు మరో నటుడు బలి..

Asuran Actor: ఎందరో ప్రముఖుల్ని పొట్టన పెట్టుకుంటోంది కోవిడ్ మహమ్మారి. అప్పటి వరకు బాగానే ఉంటున్నారు. కొవిడ్ లక్షణాలు కూడా ఉండట్లేదు. ఉన్నట్టుండి దగ్గు, ఆయాసం ఊపిరి సలపనివ్వట్లేదు.హుటా హుటిన ఆస్పత్రులకు పరిగెట్టినా ఉపయోగం లేకుండా పోతోంది.
డాక్టర్లు తమ ప్రయత్నం చేస్తూ చేతులెత్తేస్తున్నారు. కళ్లముందే అయిన వారిని పోగొట్టుకుని దుఖసాగరంలో మునిగిపోతున్నారు కుటుంబసభ్యులు. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన వారైతే ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తమిళ నటుడు నితీష్ వీర కోవిడ్ కాటుకు బలయ్యాడు.
పుదుపేటై, వెన్నిలా కబాడి కుజు వంటి సినిమాల్లో తన నటన ద్వారా ప్రేక్షకుల ప్రశంసలందుకున్నాడు. ఈ యువ నటుడు రజనీకాంత్ కాలా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించాడు. ధనుష్ నటించిన అసురన్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
సెకండ్ వేవ్ ఇండస్ట్రీకి చెందిన పెద్దలను, యువ నటులను పొట్టన పెట్టుకుంటోంది. నితీష్ మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. కొద్ది రోజుల క్రితం నితీష్ పాజిటివ్ వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్నా అతడిని వైద్యులు కాపాడలేకపోయారు.
నితీష్ వీరా మదురైకి చెందినవాడు. ఆయనకు 7,8 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవలే అతడు కారు కొనుక్కుని స్నేహితులకు చూపించి వారిని ఎక్కించుకుని ఒక రౌండ్ వేసి ఆనందించాడు. తమిళ చలనచిత్ర పరిశ్రమ సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా నితీష్ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసింది.
కాలాలో రజనీకాంత్ కుమారులలో ఒకరిగా నటించిన నటుడు నితీష్ వీరా. పుదుపేటై, వెన్నిలా కబాడి కుజు, నేత్రు ఇంద్రు, పాడై వీరన్, కాలా, ఐరా వంటి చిత్రాల్లో తన పాత్రలకు మంచి పేరు తెచ్చుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com