Tollywood : మన తెలుగు సినిమా వాళ్లు ఇంతేనా..?
సౌత్ లో ఒక భాష నుంచి మరో భాషలోకి ఎన్నాళ్లుగానో సినిమాలు డబ్ అవుతున్నాయి. అయితే ఇతర భాషలతో పోలిస్తే తెలుగు సినిమాలు డబ్ కావడం కంటే రీమేక్ అవడం ఎక్కువగా చూస్తున్నాం. అంటే తెలుగులోకి విపరీతంగా డబ్బింగ్ మూవీస్ వస్తున్నాయి. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. 2005 నుంచి 2010 వరకూ తమిళ్ డబ్బింగ్ సినిమాలు తెలుగు మార్కెట్ ను శాసించాయి అంటే అతిశయోక్తి కాదు. ఆ టైమ్ లో ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి తమిళ్ సినిమా హిట్ అయింది. ఆ కారణంగానే సూర్య, విక్రమ్ లాంటి హీరోలకు తెలుగులో మార్కెట్ క్రియేట్ అయింది. అంతకు ముందే మార్కెట్ ఉన్న రజినీకాంత్ లాంటి స్టార్స్ కు ఆ మార్కెట్ డబుల్ అయింది. సరే.. మంచి కంటెంట్ ఎక్కడ ఉన్నా.. హిట్ అయితే ఇబ్బందేం లేదు. కానీ ఈ భాషలో సినిమాలను డబ్ చేస్తూ ఈ భాషను గౌరవించకపోవడం మాత్రం క్షమించరాని తప్పిదమే. అందుకు తెలుగువాళ్లూ కారణం కావడమే ఇక్కడ విషాదం.
గత కొన్నాళ్లుగా చూస్తే తమిళ్ సినిమాలను తెలుగులో కూడా అదే టైటిల్స్ తో రిలీజ్ చేస్తున్నారు. తమిళ్ టైటిల్స్ కు తెలుగు అర్థాలిచ్చే పదాలు పెట్టడం లేదు. అజిత్ నటించిన వలిమై, శివకార్తికేయన్ అయలాన్, తాజాగా తంగలాన్.. ఇవే కాదు.. ఇలాంటి టైటిల్స్ ఇంకా చాలానే వస్తున్నాయీ మధ్య. మరో దారుణం ఏంటంటే.. రజినీకాంత్ నటించిన వేట్టైయాన్ అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. వేట్టైయాన్ అంటే వేటగాడు అని అర్థం. ఈ టైటిల్ ను కూడా తెలుగులో పెట్టడం లేదు. వేట్టైయాన్ ది హంటర్ అంటూ మళ్లీ అదే పదాన్ని ఇంగ్లీష్ పెట్టేశారు. నిజానికి ఒకప్పుడు తమిళ్ మూవీస్ కు వేరే భాష టైటిల్స్ పెడితే రాయితీలు కట్ చేసేవారు. అంత భాషాభిమానం ఉన్నది వాళ్లకు. మరి మనవాళ్లు.. పరాయి భాషా చిత్రాల టైటిల్స్ ను యధాతథంగా అంగీకరించడం చూస్తే తెలుగు భాషపై తెలుగు సినిమా వారికి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. ఏదేమైనా ఇతర భాషా చిత్రాలు వస్తున్నప్పుడు ఆ సినిమాలకు ఖచ్చితంగా తెలుగు టైటిల్స్ ను పెట్టాల్సిందే అనేలా ఒక కొత్త రూల్ లాంటిది పాస్ చేస్తే కానీ ఈ వ్వవహారం ఆగదు. లేదంటే రేపు రాబోతోన్న అజిత్ కుమార్ సినిమా విడాముయుర్చు లాంటి టైటిల్స్ ను కూడా అలాగే తెలుగులో పెట్టి విడుదల చేసినా ఆశ్చర్యం లేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com