విడాకులు వచ్చిన ఆనందం.. నటి ఫొటోషూట్..
తమ ఆనందాన్ని అందరితో పంచుకోవాలంటే ఏదో ఒక అకేషన్ ఉండాలి. పుట్టినరోజు, పెళ్లి రోజు, మరేదైనా ఇతర ప్రత్యేక రోజులలో పార్టీ చేసుకుంటారు చాలా మంది. అయితే, ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని బాధాకరమైన క్షణాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో సెలబ్రిటీలు ప్రతి చిన్న సంతోషకరమైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటాం. ఈ మధ్య విడాకుల వార్తలు ఎక్కువగా వింటున్నాం.
ఏదైనా సెలబ్రిటీ జంట విడాకులు తీసుకుంటే, వారితో పాటు అభిమానులు కూడా బాధపడుతుంటారు. అయితే అందుకు భిన్నంగా తాజాగా ఓ టీవీ నటి విడాకులు తీసుకుంది. ఈ విషయంపై ఆమె ఎలాంటి బాధను వ్యక్తం చేయలేదు. అంతేకాదు ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఫోటో షూట్ కూడా నిర్వహించారు.
తమిళ్ ఇండస్ట్రీకి చెందిన బుల్లితెర నటి షాలిని. ఆమె తమిళ సీరియల్ ముల్లుమ్ మల్లారుమ్‌తో ఖ్యాతిని పొందింది. జీ తమిళ రియాలిటీ షో సూపర్ మామ్‌లో కూడా కనిపించింది. అయితే గతంలో రియాజ్‌ని పెళ్లాడిన షాలినికి రియా అనే కూతురు కూడా ఉంది. తన భర్త రియాజ్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని కొన్ని నెలల క్రితం షాలిని విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. తాజాగా కోర్టు విడాకులు మంజూరు చేయడంతో ఆమె ఫోటో షూట్ నిర్వహించి తన ఆనందాన్ని నలుగురితో పంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను టీవీ నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి.
షాలిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో..'విడాకులు తీసుకున్న వారికి ఇది నా సందేశం. వివాహాన్ని విడిచిపెట్టడం సరైన నిర్ణయం. మీరు ఇకపై సంతోషంగా ఉండటానికి అర్హులు. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మీ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలంటే మీరు ఈ విషయాలను ఎదుర్కోవాలి. విడాకులు అంటే మనం విఫలమయ్యామని కాదు. ఇది మీ జీవితంలో ఒక మలుపు. మీ జీవితంలో సానుకూల మార్పులకు సంకేతం. ఇలా నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి. అందుకే నాలాంటి ధైర్యవంతులైన మహిళలందరికీ దీన్ని అంకితం చేస్తున్నాను' అని పోస్ట్ చేసింది. తన మాజీ భర్త ఫోటోను చింపి మరీ ఫోటోలకు పోజులిచ్చింది. విడాకులు అనే సెన్సిటివ్ విషయాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటారా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది అని షాలినికి బెస్ట్ విషెస్ చెబుతున్నారు నెటిజన్లు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com