Telugu Movies 2021: తెలుగు సినిమాల రౌండప్.. 2021 సినిమా క్యాలెండర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Telugu Movies 2021: తెలుగు సినిమాల రౌండప్.. 2021 సినిమా క్యాలెండర్‌పై మీరూ ఓ లుక్కేయండి..
Telugu Movies 2021: కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత వచ్చిన కాస్త పెద్ద సినిమా సోలోబ్రతుకే సో బెటర్.

Telugu Movies 2021: కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత వచ్చిన కాస్త పెద్ద సినిమా సోలోబ్రతుకే సో బెటర్. 2020 డిసెంబర్ లో విడుదలైంది. అప్పటికి ఉన్న మూడ్ ను బట్టి అంతా బానే ఉందన్నారు. కానీ 2021లో సంక్రాంతి బరిలో వచ్చిన మొదటి సినిమా క్రాక్. జనవరి 9న విడుదలైన క్రాక్ ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మాస్ రాజా రవితేజ ఎన్నాళ్లుగానో చూస్తోన్న విజయంగా నిలిచి తెలుగు సినిమా పరిశ్రమకూ ఓ కొత్త హోప్ ను ఇచ్చింది.


సినిమా బావుంటే జనం కరోనాను పట్టించుకోరు అన్న సంకేతాలిచ్చింది. అయితే సంక్రాంతి బరిలో వచ్చిన రెడ్ ఫర్వాలేదనిపించుకుంటే అల్లుడు అదుర్స్ డిజాస్టర్ గా నిలిచి పండగ సంబురాన్ని క్రాక్ కే మిగిల్చింది. జనవరి చివర్లో ఒకే పాటతో అంచనాలు పెంచి వచ్చిన 30రోజుల్లో ప్రేమించడం ఎలా మొదటి రోజుకే బోర్ అనిపించుకుంది.



ఫిబ్రవరిలో వచ్చిన జాంబిరెడ్డి అనూహ్య విజయం సాధించింది. కొత్త కాన్సెప్ట్ ను తెలుగు ఆడియన్సెస్ కు తగ్గ ట్రీట్మెంట్ తో ఎంటర్టైనింగ్ గా మలిచాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. దీంతో జాంబిరెడ్డి కమర్శియల్ సక్సెస్ కొట్టింది. ఇక ఫిబ్రవరిలోనే వచ్చిన ఉప్పెన బాక్సాఫీస్ ను ఉప్పెనలానే ముంచేసింది. కలెక్షన్ల సునామీ కురిపించింది.


ఊహించిన విజయమే కానీ.. మరీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. హీరోహీరోయిన్ గా పరిచయం అయిన వైష్ణవ్ తేజ్, కృతిశెట్టికి ఇది బెస్ట్ డెబ్యూగా నిలిచింది. ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరిందీ చిత్రం. దీంతో ఇక తెలుగు సినిమాకు తిరుగుండదు అని భావించారంతా.. అల్లరి నరేష్ నాంది సైతం ఆకట్టుకుంది.


నరేష్ ఇమేజ్ కు పూర్తి భిన్నంగా సాగిన ఈ మూవీ ఇండియన్ పీనల్ కోడ్ లో సామాన్యులకు ఉపయోపడే ఓ ముఖ్యమైన సెక్షన్ గురించి చర్చిస్తూ సాగినా.. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస అయి కమర్షియల్ హిట్ కొట్టింది. కపటధారి, అక్షర వంటి చిత్రాలు ఫిబ్రవరిలోనే విడుదలై ఫ్లాపులుగా నిలిచాయి. మార్చిలో వచ్చిన జాతిరత్నాలు ఎంటైర్ ఇండస్ట్రీని సర్ ప్రైజ్ చేసింది.


అసలు మూల కథంటూ ఏం లేకుండానే.. కొన్ని సన్నివేశాల సమాహారంగా వచ్చిన జాతిరత్నాలు బాక్సాఫీస్ ను షేక్ చేయడం విశేషం. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా యాభై కోట్లు కలెక్ట్ చేసి కంటెంట్ లేకుండా నవ్వించినా ప్రేక్షకులు ఆదరిస్తారని ప్రూవ్ చేసింది. ఇక మార్చిలోనే విడుదలైన ఏ1ఎక్స్ ప్రెస్, ప్లే బ్యాక్, శ్రీకారం, గాలి సంపత్, చావుకబురు చల్లగా, మోసగాళ్లు, శశి, అరణ్య వంటి చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి.

ఏప్రిల్ 2న విడుదలైన నాగార్జున వైల్డ్ డాగ్ కు మిక్స్ డ్ టాక్ వచ్చింది. బట్.. ఈ చిత్రం ఓటిటిలో పెద్ద విజయం సాధించడం విశేషం. 9న విడుదలైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఊహించినట్టుగానే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అజ్ఞాతవాసి తర్వాత పవన్ చేసిన ఈ మూవీ హిందీ పింక్ చిత్రానికి రీమేక్. అయినా పవన్ ఇమేజ్ కు అనుగుణమైన మార్పులతో మాగ్జిమం మెప్పించింది.



ఏప్రిల్ తర్వాత మరోసారి లాక్ డౌన్ అనౌన్స్ కావడంతో పరిశ్రమ మళ్లీ ఇబ్బందుల్లో పడింది. సెకండ్ లాక్ డౌన్ తర్వాత వచ్చిన చిత్రాల్లో తిమ్మరుసు, ఇష్క్, ఎస్ఆర్ కళ్యాణమండపం, ముగ్గురు మొనగాళ్లు, పాగల్ వంటి చిత్రాలు వెరీ యావరేజ్ అనిపించుకున్నాయి. శ్రీవిష్ణు నటించిన రాజరాజచోర మాత్రం మంచి సినిమాగా ఆకట్టుకుంది. కమర్సియల్ గా పెద్ద సక్సెస్ కాకపోయినా విమర్శియల్ గా మెప్పించిందీ చిత్రం.



సెప్టెంబర్ లో వచ్చిన గోపీచంద్, తమన్నాల సీటీమార్ మాస్ ఆడియన్సెస్ ను ఆకట్టుకుంది. కమర్షియల్ గా పెద్ద విజయం కాకపోయినా.. గోపీచంద్ గత చిత్రాలతో పోలిస్తే చాలా చాలా బెటర్ అనిపించుకుంది. ఓ రకంగా ఇది 2021లో గోపీచంద్ కు హిట్ మూవీగానే చెప్పాలి. తర్వాత వచ్చిన గల్లీరౌడీ, ఆకాశవాణి చిత్రాలు మెప్పించలేకపోయాయి.

బలమైన కథలు చెప్పడంలో ఎక్స్ పర్ట్ అనిపించుకున్న శేఖర్ కమ్ముల మరోసారి తనదైన శైలిలో చేసిన సినిమా లవ్ స్టోరీ. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా కమర్షియల్ గానూ, విమర్శియల్ గానూ విజయం సాధించింది. మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు, కులం అనే సమస్యల ఇతివృత్తంలో శేఖర్ కమ్ముల చెప్పిన ప్రేమకథ ప్రేక్షకులను ఆకట్టుకుంది.


అక్టోబర్ 1న వచ్చిన రిపబ్లిక్ చిత్ర డైలాగ్స్ కు చప్పట్లు పడ్డా డబ్బులు రాలేదు. అటుపై వచ్చిన ఆరడుగుల బుల్లెట్, కొండపొలం డిజాస్టర్ అనిపించుకున్నాయి. ఇక దసరా బరిలో అక్టోబర్ 14న భారీ అంచనాల మధ్య వచ్చిన మహా సముద్రం ఈ యేడాదికే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిందంటే ఆశ్చర్యమేం లేదు. ఆ స్థాయిలో బోర్ కొట్టించిందీ సినిమా.



కాకపోతే తర్వాత 15న వచ్చిన పెళ్లి సందడి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రాలకు రివ్యూస్ మిక్స్ డ్ గా ఉన్నా.. కమర్షియల్ గా లాభాలు చూడ్డం విశేషం. ఓ రకంగా దసరా వంటి పెద్ద సీజన్ లో రావడానికి పెద్ద సినిమాలు భయపడితే చిన్న సినిమాలు మరీ ఎక్కువగా క్యాష్ చేసుకోలేకపోయాయి. అక్టోబర్ చివర్లో వచ్చిన రొమాంటిక్ కమర్షియల్ గా సూపర్ హిట్ అనిపించుకుంటే వరుడు కావలెను ఓకే అనిపించుకుందంతే.



ఇక నవంబర్ పై ఎన్నో హోప్స్ పెట్టుకున్న టాలీవుడ్ కు నిరాశ తప్పలేదు. ఫస్ట్ వీక్ వచ్చిన మంచి రోజులు వచ్చాయి, పుష్పక విమానం రెండూ పోయాయి. తర్వాతి వారం వచ్చిన రాజా విక్రమార్క పరాక్రమం చూపించలేకపోయాడు. తర్వాత వచ్చిన అద్భుతం, అనుభవించు రాజా అంటూ ఏవీ మెప్పించలేకపోయాయి. అంతా ఊహించినట్టుగానే డిసెంబర్ 2న వచ్చిన అఖండ అదే రేంజ్ లో అద్భుత విజయం అందుకుంది.


చాలామంది సూపర్ హిట్ అవుతుందనుకున్నారు.. కానీ బాలయ్య నట విశ్వరూపం చూపించడం, బోయపాటి టేకింగ్, హిందూత్వ డైలాగులు అన్నీ కలిసి అఖండను బ్లాక్ బస్టర్ గా మార్చాయి. ఆ బ్లాక్ బస్టర్ ఊపు తర్వాతి వారం కనిపించకపోయినా.. పుష్ప కొనసాగించి బాక్సాఫీస్ జోష్ ను కంటిన్యూ చేసింది. పుష్ప జోష్ లో ఉండగానే శ్యామ్ సింగరాయ్ దాన్ని కంటిన్యూ చేశాడు.


మొత్తంగా డిసెంబర్ లో ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ కు కొత్త జోష్ ను తెచ్చాయి. న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాయి. బట్ చివర్లో వచ్చిన అర్జున ఫల్గుణ మాత్రం డిజాస్టర్ గా మిగలడం విశేషం. మొత్తంగా 2021లో తక్కువ సినిమాలే వచ్చినా.. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటం విశేషం. మరి ఈ సక్సెస్ రేట్ అండ్ రేషియో 2022లో మరింత పెరగాలని కోరుకుంటూ కొత్త యేడాదికి స్వాగతం పలుకుదాం.

Tags

Read MoreRead Less
Next Story