AJIT: విజయ్ రాజకీయ ప్రవేశంపై అజిత్ సంచలన వ్యాఖ్యలు

కోలీవుడ్ స్టార్ హీరో, తలా అజిత్ కుమార్ తన రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను నటన నుంచి ఎప్పుడు వైదొలగుతానో ఎవరికీ తెలియదు. బలవంతంగానైనా సినిమాను వీడాల్సి రావొచ్చు. నేను ఏ విషయాన్ని తేలికగా తీసుకోకూడదనుకుంటున్నా. ప్రేక్షకులు నా నటన గురించి ఫిర్యాదు చేస్తారేమో తెలియదు కదా! నన్ను వారంతా ఆదరిస్తున్నప్పుడే వైదొలుగుతానేమో. జీవితం చాలా విలువైనది. నేను ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను’ అని అన్నాడు. కోలీవుడ్ స్టార్ అజిత్ సినీ రంగంలో ప్రవేశించి 33 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నటుడు, టీవీకే అధినేత విజయ రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడారు. విజయ్ రాజకీయ ప్రవేశం చేయడం సాహసోపేతమైన చర్య అని ప్రశంసించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని భుజాలపై మోయటం కష్టమన్నారు. అందుకే రాజకీయాల్లో ప్రవేశించే సినీ కళాకారులకు శుభాకాంక్షలు చెబుతానని, తనకు మాత్రం రాజకీయాల్లో రావాలనే ఉద్దేశం లేదన్నారు.
రాజకీయాలపైనా...
అజిత్ రాజకీయాలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ ప్రవేశం చేయవచ్చని.. తనకు మాత్రం రాజకీయల పట్ల ఆసక్తి లేదన్నాడు. 140 కోట్ల జనాభాను ఏకతాటిపై తీసుకురావటం ఒక్క రాజకీయ నేతలకే సాధ్యమవుతుందన్నాడు. రాష్ట్రపతి భవన్‌లో నియమాలు, భద్రతా ఏర్పాట్లు చూసి ఆశ్చర్యానికి గురయ్యానని.. నాయకుల జీవనయానం ఎలా సాగిస్తున్నారో అప్పుడే తెలిసిందన్నారు. " నా జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నా’’ అన్నారు. "నేను స్టార్‌గా ఎదగాలని ఇండస్ట్రీకి రాలేదు. నా అప్పులు తీర్చడానికి నటుడిని అయ్యాను. నా మొదటి సినిమా చూస్తే నటన భయంకరంగా ఉంటుంది. తమిళంలోని నా సినిమాలను మరొకరితో డబ్బింగ్ చెప్పించేవారు. నేను మాట్లాడే యాస బాలేదని విమర్శించారు." అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com