Thandel Piracy : నాగ చైతన్య కూడా తప్పించుకోలేకపోయాడు

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన మూవీ తండేల్. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. నాగ చైతన్య ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న విజయాన్ని ఈ చిత్రం అందించినట్టే అని ఫ్యాన్స్ అంతా ఖుషీ అయిపోతున్నారు. ఇక నాగార్జున అయితే తన ఆనందాన్ని పట్టలేకపోతున్నాడు. కొడుకు విజయాన్ని అభిమానుల విజయం కూడా అంటూ ఆకాశానికెత్తుతున్నాడు. ముఖ్యంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నాగ చైతన్య నటన గురించి అదే పనిగా మాట్లాడుకుంటున్నారు. ఇన్నేళ్ల కెరీర్ లో అతని నటన ఇంత మెచ్యూర్డ్ గా ఎప్పుడూ లేదు. సాయి పల్లవితో పోటీ పడి మరీ గెలిచినంత పనిచేశాడు.దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు మ్యాజిక్ లా పని చేస్తోంది.అన్ని వయసుల ఆడియన్స్ ను అలరించేలా ఉంది తండేల్ అనే టాక్ తెచ్చుకుంది.
ఇక చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించాడు. అయితే ఈ మూవీ విజయాన్ని వీళ్లు ఆస్వాదించేలోపే పైరసీ భూతం అలుముకుంది. సంక్రాంతి టైమ్ లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ను బలి తీసుకున్నట్టే ఈ తండేల్ కూడా పైరసీకి గురైంది. ఏకంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే ప్రదర్శిస్తున్నారంటే.. ఇక బయటకు తెలియకుండా ఏ రేంజ్ లో పైరేట్ అయి ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా గేమ్ ఛేంజర్ లాగా తండేల్ కూడా హెచ్.డి ప్రింట్ అవైలబుల్ ఉందట. ఓ రకంగా చూస్తే టాలీవుడ్ పై మరోసారి పైరసీ భూతం హవా చేస్తోందనుకోవచ్చు. కొన్నాళ్లుగా పైరసీకి సంబంధించిన వార్తలు రావడం లేదు అనుకుంటోన్న టైమ్ లో పెద్ద సినిమాలు, హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు ఏకంగా హై క్వాలిటీతో రిలీజ్ రోజునే బయటకు రావడం ఇండస్ట్రీని ఆందోళనకు గురి చేస్తోంది. ఇది ఇక్కడితో ఆగిపోదు.. రాబోయే పెద్ద సినిమాలన్నీటికీ పైరసీ పెద్ద శాపం అవుతుంది. అందుకే దీనిపై ఏదైనా గట్టి ప్రణాళిక చేస్తే కానీ ఉపయోగం ఉండదు. లేదంటే ఇండస్ట్రీ అంతా పైరేట్ అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com