Thandel Trailer : పాకిస్తాన్ ను తిడితే పనైపోతుందా తండేల్ ..

ఒక సహజమైన కథ. దాన్ని అంతే సహజంగా తెరకెక్కించినా అద్భుతమైన ఎమోషన్స్ పండుతాయి. ఆ ఎమోషన్స్ కు వీళ్లు అనుకున్న ప్రేమకథా తోడైతే ఓ మంచి సినిమా తయారవుతుంది. కానీ కేవలం పాకిస్తాన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది తండేల్ మూవీ ట్రైలర్ చూస్తుంటే. అసలు ఒక దేశం బంధించిన అదీ పాకిస్తాన్ లాంటి శతృదేశం బంధించిన ఖైదీలను ఎంత క్రూరంగా హింసిస్తారు.. ఎంత దారుణంగా చూస్తారు అనే మినిమం అవగాహన లేకుండా రాసుకున్న కథలా కనిపిస్తోంది. అసలు ఎలా చూసినా ఇప్పుడు పాక్.. భారత్ కు ఏ విధంగానూ పోటీ కాదు. రాలేదు.ఆ శక్తి ఆ దేశానికి ఎప్పుడూ లేదు. ఎప్పటికీ రాదు. అయినా పాకిస్తాన్ ను ను తిడితే కాసులు రాలిపోతాయి అనే భ్రమల్లో ఉన్నట్టుగా ఉన్నాడీ దర్శకుడు. ఒకవేళ తిట్టడమే నిజం అయినా.. అతనో జవాన్ అయితేనో.. ఓ ఏజెంట్ అయితోనే సెట్ అవుతుంది. ఓ సాధారణ జాలరి.. తను తిరిగి ఇంటికి వెళతాడో లేదో తెలియని బ్రతుకు భయంలో ఉండి కూడా అదే జైల్లో వారిని కొడుతూ.. తిడుతూ ఉంటే దానికి దేశభక్తి రంగు పూయడం.. ఎంత వరకు సబబు. సరే సినిమా ఇంకా రాలేదు కాబట్టి ఇంకేదో ఎమోషన్ లో హీరో వారిపై తిరగబడ్డాడు అనే అనుకుందాం. కానీ ఎప్పుడో 90ల కాలంలో విజయ్ కాంత్, అరుణ్ పాండ్యన్, మన శ్రీహరి లాంటి హీరోలు కూడా ఎప్పుడో వాడేసిన కుక్కలు మూత్రం పోస్తే పాకిస్తాన్ కొట్టుకుపోతుంది అనే డైలాగుల దగ్గరే ఆగిపోయారంటే ఇంకేం చెబుతాం దర్శకుడు చందు మొండేటి క్రియేటివిటీ గురించి.అసలు ఈ తరహా డైలాగ్స్ పూర్తిగా దేశభక్తితో నిండి ఉన్న సినిమాల్లో కూడా కనిపించవు. ఆ మధ్య వచ్చిన మేజర్ కావొచ్చు.. తాజాగా వచ్చిన అమరన్ కావొచ్చు.. అప్పుడెప్పుడో బాలీవుడ్ రూపొందిన బోర్డర్ లాంటి మూవీస్ లో కావొచ్చు. ఇలాంటి చవకబారు డైలాగులే కనిపించవు.
సరే పాక్ ను తిడితే మీకెందుకు కోపం అనే వారూ ఉండొచ్చు. కానీ ఇది ఓ వాస్తవ కథ. కొన్నేళ్ల క్రితం శ్రీకాకుళం ప్రాంతంలో సముద్ర జలాల్లోకి చేపల వేటకు వెళ్లి పొరపాటున పాక్ జలాల్లోకి వెళ్లి.. ఆ దేశపు నేవీకి దొరికి.. వీళ్లను గూఢచారులేమో అనుకుని జైల్లో బంధించి చిత్రహింసలు పెట్టింది పాక్. మన దేశం జోక్యం చేసుకుని వారిని కష్టంమీద విడిపించారు.ఈ జరిగిన కథనే సినిమాగా తీస్తున్నారు. అలాంటప్పుడు నిజానికి కాస్త కూడా దగ్గరగా లేకుండా ఓ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా తీస్తున్నారంటే అప్పుడు ఆ కథను వీళ్లు అడాప్ట్ చేసుకోలేదు అనే అనుకోవాలి.
ఇక నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ప్రేమకథ కూడా ఫోర్స్ డ్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఓ సహజమైన ప్రేమకథలా కనిపించడం లేదు. పాటల్లో ఉన్నంత గ్రేట్ నెస్ కథలో కనిపించడం లేదు అనే కమెంట్స్ కూడా వస్తున్నాయి. ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనంతగా నాగ చైతన్య మూవీ ట్రైలర్ కోసం చూశారు జనం. తీరా ట్రైలర్ చూశాక.. ఇంతేనా అనే భావన కలిగిందంటే ఆశ్చర్యమేం లేదు.
నాగ చైతన్య ఈ పాత్ర కోసం సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడని తెలుస్తోంది. సాయి పల్లవి డైలాగుల్లో ఇంకా తెలంగాణ మాండలికం కనిపిస్తోంది. ఆమె నటన గురించి కొత్తగా చెప్పేదేముందీ. మిగతా పాత్రలేవీ ఈ ట్రైలర్ లో హైలెట్ చేయలేదు. 'మన గురించి మాట్లాడతున్నరంటే మన ఫేమస్ అయిపోయినట్టే' అనే డైలాగ్ యువతరానికి బాగా నచ్చొచ్చు. 'ప్రమాదం అని తెలిసినా తన మందికోసం ముందుకు అడుగేసినోడే తండేల్.. తండేల్ అంటే ఓనర్ కాదు.. లీడర్' అనే డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంది. మరి నాగ చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో కానీ.. తండేల్ ట్రైలర్ అయితే ఎక్స్ పెక్ట్ చేసినంత గొప్పగా లేదనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com