Katha Keli Teaser : హారర్ చిత్రంతో భయపెడుతోన్న 'శతమానం భవతి' డైరెక్టర్

'ఎంత మంచివాడవురా', 'శతమానం భవతి', 'దొంగల బండి', 'నాంది' సినిమాలను రూపొందించిన దర్శకుడు సతీష్ వేగేశ్న మరో కొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు 'కథాకేళి' అనే పేరును ఫిక్స్ చేసిన మేకర్స్.. తాజాగా మూవీ లోగోను, టీజర్‌ను లాంఛ్ చేశారు. మూవీ లోగోను అగ్ర నిర్మాత దిల్ రాజు విడుదల చేయగా, టీజర్‌ను స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆవిష్కరించారు. చింతా గోపాలకృష్ణా రెడ్డి సమర్పణలో శతమానం భవతి ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో యశ్విన్, దినేశ్ తేజ్, అజయ్, బాలాదిత్య, పూజితా పొన్నాడ, నందిని, ఆయుషి, ప్రీతి, విరాట్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి ఎస్.కె.బాలచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, దాము నర్రావుల సినిమాటోగ్రఫీగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సైతం పాల్గొన్నారు. ఇక టీజర్‌లో కేవలం పాత్రలను పరిచయం చేయడంతోపాటు భయానక దృశ్యాన్ని కూడా చూపించారు. దీన్ని బట్టి చూస్తుంటే హారర్ అంశాలతో నిండిన కథతో కథాకేళి రూపొందుతున్నట్టు తెలుస్తోంది.
"ఆ శతమానం భవతి సినిమా మా బ్యానర్‌లో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడదే పేరుతో సతీశ్ బ్యానర్ పెట్టటం చాలా సంతోషంగా ఉంది. చాలా పాజిటివ్‌గా అనిపించింది. సతీశ్ సహా అందరికీ ఆల్ ది బెస్ట్. కొత్త, పాత నటీనటులు, సాంకేతిక నిపుణుల కలయికలో సతీశ్ చేసిన ప్రయత్నం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ‘కథా కేళి’ టీజర్ చూస్తుంటే సతీశ్ కొత్త ప్రయత్నం చేసినట్లు అనిపించింది. సినిమా విజయం సాధించి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను" అని నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యానించారు.
‘‘నేను ఇండస్ట్రీలోకి వచ్చి పాతికేళ్లు అవుతుంది. ప్రియా ఓ ప్రియా చిత్రంలో నా పేరును మొదటిసారి స్క్రీన్‌పై చూసుకున్నాను. ఆరోజు నుంచి ఈ రోజు వరకు రైటర్, డైరెక్టర్‌గా నిలబడ్డాను. ఈ బ్యానర్ పెట్టినప్పుడు ఎందుకు బ్యానర్ పెట్టావని చాలా మంది అడిగారు. ఇదే ప్రశ్నను నేను ఈవీవీ సత్యనారాయణగారిని వేశాను. హాయ్ సినమా నుంచి ఈవీవీగారి చివరి సినిమా వరకు ఆయన దగ్గరే పని చేశాను. ఆయన తన అనుభవాలను చెప్పేవారు. ఓసారి ఈవీవీ సినిమా అనే బ్యానర్ ఎందుకు పెట్టారని నేను అడిగినప్పుడు మనకు సినిమా తప్ప మరేం రాదు. మనం సినిమాలు మాత్రమే తీయగలం. మనం ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడు మనతో నిర్మాతలు సినిమాలు చేయరు. ఒకవేళ నిర్మాతలు ఓకే అన్నా కూడా ఆర్టిస్టులు ముందుకు రారు. కష్టమైనా, నష్టమైనా మనమే చేయాలని అన్నారు. ఆయన చెప్పిన మాటలతోనే ఇప్పుడు బ్యానర్ పెట్టాను. కొవిడ్ వల్ల నేను స్టార్ట్ చేసిన కోతి కొమ్మచ్చి, శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమాలు లేట్ అవుతున్నాయి. ఈ గ్యాప్‌లో ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేద్దామని చేసిన సినిమానే ఈ కథాకేళి’’ అని చిత్ర దర్శకుడు సతీశ్ వేగేశ్న చెప్పుకొచ్చారు.
‘‘నా పాతికేళ్ల ప్రయాణానికి కారణమైన నా తల్లిదండ్రులకు, నన్ను రైటర్‌గా పరిచయం చేసిన ముప్పలనేని శివగారికి, నన్ను డైరెక్టర్‌ని చేసిన ఈవీవీ సత్యనారాయణగారికి, అల్లరి నరేష్‌గారికి, దిల్ రాజు, హరీష్ శంకర్‌గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ కెరీర్‌లో నాకు తోడుగా నిలిచిన నా భార్య రమకి, నా కొడుకు యశ్విన్, కూతురు శిరీష్, తమ్ముడు ప్రదీప్‌కి ఎప్పటకీ రుణ పడి ఉంటాను. ఈ సినిమాలో ఆర్టిస్టులందరూ ఇప్పటి వరకు చాలా కథలు చెప్పి ఉంటారు. సాధారణంగా దెయ్యం కథలను అందరూ చెప్పి ఉంటారు. కానీ దెయ్యానికే కథ చెప్పాల్సి వస్తే.. అనేదే మా కథా కేళి సినిమా. దిల్ రాజుగారు చెప్పినట్లు డిఫరెంట్‌గా ప్రయత్నం చేసినప్పటికీ నా స్టైల్లో ఫ్యామిలీస్ అందరూ చూసి వారి పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకునే కథ ఉంది. ఇప్పటి యూత్‌కు నచ్చే కథ, అందరినీ నవ్వించే హారర్‌కామెడీ ఉంది. ఈ సినిమాలో పని చేసిన నా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కి, మా చింతా గోపాల కృష్ణారెడ్డిగారికి థాంక్స్. డెఫనెట్‌గా సినిమా అందరినీ అలరిస్తుంది’’అంటూ డైరెక్టర్ సతీశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com