The Kashmir Files: వారం రోజుల్లో వంద కోట్లు.. కలెక్షన్లు కురిపిస్తున్న 'ద కశ్మీర్ ఫైల్స్'

The Kashmir Files: కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై వివాదాలు, ప్రశంసలు ఎలా ఉన్నా.. కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌ల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజు కేవలం మూడున్నర కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు నుంచి సంచలనం సృష్టించింది.
రెండో రోజు ఏకంగా తొమ్మిదిన్నర కోట్లు, మూడో రోజు 15 కోట్లు, నాలుగో రోజు మరో 15 కోట్లు, ఐదో రోజు 18 కోట్లు, ఆరో రోజు 19 కోట్లు, ఏడో రోజు మరో 18.05 కోట్లు వసూలు చేసింది. ఇలా విడుదలైన వారం రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు రాబట్టింది.
వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ఈ సినిమా కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. మొదటి రోజు దేశవ్యాప్తంగా 400 థియేటర్లలో విడుదలైన ఆ సినిమా.. వారం తిరిగే సరికి 4వేల థియేటర్లకు చేరింది. ప్రస్తుతం ఈ సినిమాను ప్రదర్శించే థియేటర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది.
నిజానికి డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, చిత్ర బృందం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాను కలిసిన తరువాతే సినిమా కలెక్షన్స్ పెరిగాయన్న విమర్శలూ ఉన్నాయి.
కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడాలని మోదీ పిలుపివ్వడం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సినిమాకు పన్ను మినహాయింపులు ప్రకటించడం అసోంలో ప్రభుత్వ ఉద్యోగులు ఈ సినిమా కోసం హాఫ్ డే లీవ్ ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
కశ్మీర్ పండిట్లపై జరిగిన దురాగతాలకు ఈ సినిమా అద్దం పడుతోందని కొందరు ప్రశంసిస్తుంటే.. కఠిన చట్టాలతో ముస్లింలపై ఉక్కుపాదం మోపవచ్చనే ఉద్దేశంతోనే ఆనాడు పండిట్లను కశ్మీర్ నుంచి పంపించేశారని మరికొందరు విమర్శిస్తున్నారు.
ఏదేమైనా ఓ సున్నితమైన అంశాన్ని దర్శకుడు తెరకెక్కించిన విధానం ప్రశంసనీయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంచనాలకు మించి కశ్మీర్ ఫైల్స్ కలెక్షన్లు కురిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com