Mohan Babu : వ్యాపారం, పనిమనుషుల మీదుగా 'మంచు' మంటలు

Mohan Babu :  వ్యాపారం, పనిమనుషుల మీదుగా మంచు మంటలు
X

మంచు వారి కుటుంబంలో మంటలు అంటుకున్నాయి. అన్ని ఫ్యామిలీస్ లోనూ గొడవలుంటాయి. కానీ ఈ స్థాయిలో బయటకు వచ్చినది వీరివి మాత్రమే. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ ఫ్యామిలీ అంటే చులకనగా చూస్తుంటారు కొందరు. ఇక ఈ గొడవ తర్వాత మీమ్స్, ట్రోల్స్ కు ఏళ్ల పాటు వీళ్లు 'మేత' అవుతారు. అయితే సోషల్ మీడియాతో పాటు సాధారణ జనంలో మంచు మనోజ్ పై కొంత సాఫ్ట్ కార్నర్ కనిపిస్తుంది. అందుకే అతనికి కాస్త ఎక్కువ సపోర్ట్ ఉంది.దీనికి తోడు మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై దాడి చేయడం.. అతనికి సీరియస్ ఇంజూరి కావడంతో గొడవ మీడియా వైపూ టర్న్ అయింది. ఇవన్నీ పక్కన పెడితే అసలు మంచు వారింట మంటలు ఎక్కడ మొదలయ్యాయి. ఎవరి కారణంగా ఇదంతా ఇంత రచ్చగా మారింది అనేది చూస్తే.. ఈ కుటుంబ కథా చిత్రంలో రెండు ప్రధాన అంశాలున్నాయి. మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సంతానం లక్ష్మి, విష్ణు. రెండో భార్యకు పుట్టిన వాడు మనోజ్. ఇక కథలోకి వెళితే..

మోహన్ బాబు నటించిన కుంతీపుత్రుడు సినిమాలోని ఓ పాటలో పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికీ అనే లైన్ ఉంటుంది. అది ఆయన కుటుంబంలోనూ కనిపిస్తుంది. మోహన్ బాబుకు మనోజ్ కంటే విష్ణు అంటేనే ఎక్కువ ఇష్టం అంటారు. అందుకు కారణం విష్ణు తండ్రికి చేదోడుగా ఉంటాడు. అతనేం చెప్పినా చేస్తాడు. తన తర్వాత ఆస్తులు, వ్యాపారాలు చూసుకునే దక్షత విష్ణుకే ఉందని ఎక్కువగా నమ్ముతాడు. అందుకు కారణం.. మనోజ్ పూర్తిగా విష్ణుకు భిన్నంగా ఉండటమే అంటారు. అంటే తండ్రి చెప్పిన మాట వినడనీ.. ప్రతి దానికీ ఎదురుతిరుగుతాడు అని అంటారు. దీనికి విష్ణు తండ్రికి ఇంకా ఏదో చెబుతూ మనోజ్ పై కోపం పెరిగేలా చేస్తాడు అనేవారూ ఉన్నారు. ఇవన్నీ సాధారణంగా అన్ని కుటుంబాల్లోనూ కనిపిస్తాయి. అవి అంతర్గతంగా ఉన్నంత వరకూ ఎవరూ పట్టించుకోరు. బయటకు వచ్చి బాహాటంగా తలపడితేనే చులకన అవుతారు. మంచు వారింట ఇప్పుడు కనిపించేది అదే.

ఇక మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడం.. అది కూడా మౌనికను పెళ్లి చేసుకోవడం కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదు. ఆమెకు ఆల్రెడీ కొడుకు ఉన్నాడనే కారణంతో మోహన్ బాబుతో పాటు కుటుంబమూ వ్యతిరేకించింది. అయినా మనోజ్ వినలేదు. చివరికి మనోజ్ అభీష్టం మేరకు పెళ్లికి ఒప్పుకున్నారు. అప్పటి నుంచే మరింత కలతలు మొదలయ్యాయి అనేది మోహన్ బాబు ఆడియో వింటే అర్థం అవుతుంది. ఇదీ కాక కొన్నాళ్లుగా మనోజ్ తిరుపతితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వారి విద్యాలయాల విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు అనేది ప్రధాన ఆరోపణ. అక్కడి ఫీజులు, విద్యార్ధుల పట్ల విష్ణు వ్యవహరించే విధానంపై నేరుగా ఇన్వాల్వ్ అవుతున్నాడట. ఇది విష్ణుకు నచ్చలేదు. తండ్రికి చెప్పాడు. తండ్రి మనోజ్ ను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. కొన్ని రోజుల తర్వాత తను విద్యా సంస్థల విషయంలో జోక్యం చేసుకోను అంటూ తండ్రి వద్దకు వచ్చాడు. మోహన్ బాబు భార్య నచ్చ చెప్పడంతో ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మోహన్ బాబు పనిమనుషులను మనోజ్ ఇబ్బంది పెట్టాడట. వారి స్టాఫ్ పై చేయి చేసుకున్నాడు. ఇదేంటని అడిగిన తండ్రిని కూడా నెట్టేశాడట మనోజ్. మాటా మాటా పెరిగి ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో మోహన్ బాబుకు మరింత కోపం వచ్చి మళ్లీ వెళ్లగొట్టాడు. అప్పటి నుంచి డ్రామా మొదలైంది.

తన తండ్రి నుంచి ప్రాణ హాని ఉందని మోహన్ బాబు హాస్పిటల్ కు వెళ్లడం.. ఆ రోజు మెడకు పట్టీతో బయటకు రావడం.. నెక్ట్స్ డే పోలీస్ ల దగ్గర పట్టీ లేకుండానే కనిపించడం.. ఆపై మోహన్ బాబు ఇంటికి వెళ్లి హడావిడీ చేయడం.. విషయం తెలిసి ముంబైలో ఉంటున్న లక్ష్మి వచ్చి చెప్పినా మనోజ్ అండ్ కో పట్టించుకోలేదు. విదేశాల నుంచి విష్ణు వచ్చాక.. అతని బౌన్సర్లు, మనోజ్ బౌన్సర్ల మధ్య చిన్న ఫైట్ జరగడం.. అక్కడే ఉన్న పోలీస్ లు దాన్ని పట్టించుకోకపోవడం నుంచి మనోజ్ మీడియాను మోహన్ బాబు ఇంటికి పిలిచి మరీ అక్కడ హడావిడీ చేయడం.. చివరికి అసలే కోపదారి మనిషి అయిన మోహన్ బాబు విచక్షణ కోల్పోయి మీడియా ప్రతినిధిపై దాడి చేయడం వరకూ వచ్చింది. ఆనక మోహన్ బాబు అస్వస్థతో భార్యా సమేతంగా హాస్పిటల్ లో జాయిన్ కావడం వరకూ ఈ కథ కొనసాగింది.

మొత్తంగా చూస్తే ఓ తండ్రి ఆవేదన.. కొడుకుల ఆరాటం.. పోరాటం కనిపిస్తోంది. విద్యా వ్యాపారంలో కలగజేసుకున్నాడని.. తన స్టాఫ్ ను కొట్టాడనే కారణంతో మనోజ్ ను ఇంటి నుంచి గెంటివేశాడు మోహన్ బాబు. ఆ తర్వాత జరిగేదంతా ఒకరిపై ఒకరు చేసుకునే ఆధిపత్యం పోరాటమే తప్ప.. ఇందులో వ్యక్తిగత అంశాలు లేవని అందరికీ మనవి చేస్తున్నారు వారి కుటుంబ సభ్యులు.

Tags

Next Story