Sarangapani Jathakam : టాక్ సూపర్.. కలెక్షన్స్ పూర్

సినిమాలు బావుంటే చాలు చూడ్డానికి జనం ఎగబడతారు అంటుంటారు. బట్ కొన్నిసార్లు బావున్నా ఆ విషయం సరిగా తెలియకనో లేక ఓటిటిలో చూద్దాం లే అనే భావనతోనో కొన్ని మంచి సినిమాలను థియేటర్స్ లో మిస్ అవుతుంటారు. ఈ సమ్మర్ టాలీవుడ్ కు చాలా చేదుగా ఉందని చెప్పాలి. రెండు మూడు సినిమాలు తప్ప ఏదీ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. మళ్లీ ప్రతి వారం అరడజను సినిమాల వరకూ విడుదలవుతూనే ఉన్నాయి. అయినా ఆకట్టుకోవడం లేదు. కారణం నాని చెప్పినట్టు కంటెంట్ లేకపోవడమే. బట్ ఈ వారం విడుదలైన సారంగపాణి జాతకం కంటెంట్ ఉన్న సినిమానే. మంచి వినోదాన్ని అందించిన సినిమా. ఇంటిల్లి పాదీ హ్యాపీగా కాలక్షేపం చేయగలిగే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్. ఈ చిత్రానికి టాక్ బావుంది. రివ్యూస్ కూడా బావున్నాయి. అయినా ఆడియన్స్ నుంచి ఆ స్థాయి స్పందన లేదు. కలెక్షన్స్ డల్ గా ఉన్నాయి.
ప్రియదర్శి, రూపా జంటగా వెన్నెల కిశోర్, వైవా హర్ష, నరేష్, అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ వడ్లమాని, రూపాదేవి, కల్పలత కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఏ మాత్రం అసభ్యత, అశ్లీలత లేకుండా.. క్లీన్ కామెడీగా అలరించింది. అయితే ఈ తరహా చిత్రాలను ఓటిటిలో చూద్దాం అనుకుంటున్నారేమో కానీ.. ఆడియన్స్ నుంచి ఓ మంచి సినిమాకు రావాల్సినంత స్పందన మాత్రం రావడం లేదు అనే అంటున్నారు.
ఇక మళయాలం నుంచి వచ్చిన జంఖానా మూవీ పరిస్థితి కూడా ఇంతే. ప్రేమలు చిత్రంతో ఆకట్టుకున్న నాస్లేన్ హీరోలాగా కనిపిస్తూ.. ఇతర పాత్రలన్నీ సమాన ప్రాధాన్యంతో రూపొందిన ఈ చిత్రం యూత్ ను ఆకట్టుకునే అంశాలతో రూపొందింది. అలాగని ఇందులో అడల్ట్ కామెడీ ఉందనుకోవద్దు. ఇదీ కంప్లీట్ గా క్లీన్ కామెడీ మూవీ. ఇంటర్ మీడియొట్ వయసులో కుర్రాళ్ల నిర్ణయాలు వారిని ఎలా ప్రభావితం చేస్తాయి.. అనే అంశాలతో ఆద్యంతం అదిరిపోయే కామెడీతో అలరిస్తుందీ మూవీ. మళయాలంలో 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రానికీ తెలుగులో అంతంత మాత్రం ఆదరణే కనిపిస్తోంది.
సారంగపాణి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తే.. జింఖానా యూత్ ను అట్రాక్ట్ చేస్తుంది. మరి ఈ రెండు సినిమాల కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉంటుందో కానీ.. కంటెంట్ పరంగా సూపర్ అనిపించుకున్నా.. కమర్షియల్ గా పూర్ అనేలా ఉంది ఇప్పటి వరకూ పరిస్థితి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com