Rishab Shetty : రిషభ్ శెట్టి కష్టానికి దక్కిన ఫలితం ఇది

నేషనల్ బెస్ట్ యాక్టర్.. ఇలా అనిపించుకోవడం చాలామంది ఆర్టిస్టుల కల. ఆ కలలు అందరికీ నెరవేరవు. అందుకు టైమ్, లక్ కూడా ఉండాలి. అఫ్ కోర్స్ బోలెడంత టాలెంట్ తర్వాతే ఈ రెండూ అవసరం. మొన్నటి వరకూ ఓ సాధారణ కన్నడ నటుడుగానే తెలిసిన రిషభ్ శెట్టి కాంతార మూవీతో ఓవర్ నైట్ దేశం మొత్తానికి తెలిసాడు. అది కూడా మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకుంటూ. కాంతార లాంటి సినిమాలో నటించడమే కత్తిమీద సాములాంటిది. అలాంటిది తను నటిస్తూ సినిమాను డైరెక్ట్ చేశాడు. పైగా ఇలాంటి కోట్లమంది భక్తితో కూడా ముడిపడిన ఫోక్లోర్ స్టోరీస్ ను కమర్షియల్ మీటర్ లో చెప్పడం టాలెంట్ కే సవాల్ లాంటిది. ఆ సవాల్ లో రిషభ్ గెలిచాడు.
ఒక ప్రాంతానికి చెందిన చిన్న కథను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో రిలేట్ చేసుకునేలా చెప్పాడు. దేవుడంటే వీళ్లు మాత్రమే అని సోకాల్డ్ మత ఛాందసవాదుల మాటలను ఎండగడుతూ.. ప్రతి సమూహానికి ఇలాంటి దేవుళ్లు ఉన్నారు. వారికంటూ ప్రత్యేకమైన ఆచారాలున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలు వేరుగా ఉంటాయని ఎలుగెత్తి చాటుతూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఓ చిన్న వేటగాడుగా మొదలై.. తనూ ఆ గ్రామీణ దేవతా ప్రతీకగా మారిపోవడం వరకూ అనేక వేరియేషన్స్ ను అద్భుతంగా పలికిస్తూ.. దర్శకత్వంలోనూ, నటనలోనూ శెభాష్ అనిపించుకున్నాడు రిషభ్.
పంజుర్లీ, భూతకోల, గుళిగ అంటూ భిన్నమైన పేర్లతో పిలుచుకునే గ్రామ దేవతల కథను వెండితెరపై ఆబాలగోపాలం అబ్బురపడేలా అద్భుతంగా చూపించాడు రిషభ్. ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడుగా ఎంపిక కావడం అతని ప్రతిభకు దక్కిన ప్రతిఫలం. అతని కష్టానికి దక్కిన గౌరవం. ఈ అవార్డ్ పొందిన రిషభ్ శెట్టికి శుభాకాంక్షలు చెబుతూ.. కాంతార కు ప్రీక్వెల్ గా రాబోతోన్న సినిమాకు ఆల్ ద బెస్ట్ చెబుదాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com