Oscars 2022: ఆస్కార్ 2022లో ఎక్కువ అవార్డులు కొల్లగొట్టిన సినిమా ఏంటంటే..?

Oscars 2022: 2022 ఆస్కార్ అవార్డులను డ్యూన్ సినిమా కొల్లగొట్టింది. 94వ అకాడమీ అవార్డుల వేడుకలో పలు విభాగాల్లో అత్యధిక అవార్డులను డ్యూన్ చిత్రం ఎగరేసుకెళ్లింది. ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రంగా కోడా సినిమా నిలిచింది. ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫేయీ చిత్రంలో అత్యద్భుత నటనకుగాను జెస్సీకా చాస్టెయిన్ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. కింగ్ రిచర్డ్ సినిమా నటుడు విల్ స్మిత్ ఉత్తమ నటుడుగా.. ది పవర్ ఆఫ్ ది డాగ్ చిత్రానికిగాను జాన్ కాంపియన్ ఉత్తమ దర్శకుడు అవార్డును దక్కించుకున్నాడు.
అమెరికా లాస్ ఏంజెల్స్‌లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాలు ఘనంగా జరిగాయి. కరోనా కారణంగా గత రెండేళ్లు అంతగా సందడి లేకుండాపోయిన వేడుకలు.. ఈసారి కన్నుల పండువగా సాగింది. హాలీవుడ్ తారాగణం, దర్శకులు, టెక్నీషియన్స్ ఇలా 24 క్రాఫ్ట్స్‌కు చెందిన వారంతా భారీగా తరలివచ్చారు. పలువురు నటీనటులు ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై తళుక్కున మెరిసి అందరినీ ఆకట్టుకున్నారు.
ఇక.. ఈసారి ఉత్తమ చిత్రం విభాగంలో బెల్‌ఫాస్ట్, కోడా, డోన్ట్ లాకప్, డ్రైవ్ మై కార్, డ్యూన్, కింగ్ రిచర్డ్, లికోరైస్ పిజా నైట్‌మేర్ అల్లీ, ది పవర్ ఆఫ్ ది డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీ సినిమాలు పోటీపడ్డాయి. అలాగే ఉత్తమ నటీనటులు, దర్శకులు, సహాయ నటీనటులు, ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే, సాంగ్.. ఇలా ఆయా విభాగాల్లో పలువురు నామినేషన్ వేశారు. అత్యధికంగా పవర్ ఆఫ్ డాగ్ చిత్రం 12 విభాగాల్లో నామినేట్ కాగా.. ఆ తర్వాత అత్యధిక నామినేషన్లు అందుకున్న చిత్రంగా డ్యూన్నిలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com