Tollywood : ప్రముఖ నటుడు కాస్ట్యూమ్ కృష్ణ ఇకలేరు
టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ ఇకలేరు. చెన్నైలోని సృగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కాస్ట్యూమ్ కృష్ణ పూర్తి పేరు మాదాసు కృష్ణ. స్వస్థలం విశాఖ. కాస్ట్యూమ్స్ కృష్ణకు నలుగురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.
కృష్ణ పేరుతో తెలుగు చిత్రసీమలో చాలా మంది ఉన్నా.. కాస్ట్యూమ్స్ కృష్ణకు గుర్తింపు ఉంది. తెలుగులో అనేక సినిమాలకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. డ్రస్ డిజైనింగ్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ సమకూర్చేవారు. 1954లో మద్రాస్ వెళ్లారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో ఎక్కువ రోజులు పని చేశారు. మొదట్లో సురేష్ కృష్ణ అని పిలిచినా.. తర్వాత కాస్ట్యూమ్స్ కృష్ణగా ఆయన పేరు స్థిరపడింది.
భారత్ బంద్‌తో నటుడిగాను కాస్ట్యూమ్ కృష్ణ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. దర్శకుడు కోడి రామకృష్ణ ఆయన్ను నటుడిగా మార్చారు. ఆ తర్వాత పెళ్ళాం చెబితే వినాలి, పోలీస్ లాకప్, అల్లరి మొగుడు, దేవుళ్ళు, మా ఆయన బంగారం, విలన్, శాంభవి ఐపిఎస్, పుట్టింటికి రా చెల్లి తదితర సినిమాల్లో నటించారు. కాస్ట్యూమ్స్ కృష్ణ నిర్మాతగాను పలు చిత్రాలను నిర్మించారు. జగపతిబాబు కథానాయకుడిగా నటించిన పెళ్లి పందిరి సినిమాను నిర్మించిన ఆయన.. అంతకు ముందు అరుంధతి అని ఓ సినిమా తీశారు. సూపర్ స్టార్ కృష్ణ అశ్వత్థామ సహా మొత్తం 8 సినిమాలు తీశారు. ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లోను నటుడిగాను నటించారు కాస్ట్యూమ్స్ కృష్ణ.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com