Suhas: ఎక్కడి నువ్వు ఎక్కడికి వచ్చేశావురా సుహాసూ.. రైటర్ పద్మభూషణ్ ఎమోషనల్ పోస్ట్

Suhas: చిన్న చిన్న కోర్కెలు.. పెద్దవి కావాలంటే ఎంత కష్టపడాలి.. దానికి తోడు పిసరంత అదృష్టం కూడా తోడవ్వాలి.. వెరసి నటుడవ్వాలనే తన కల నెరవేరింది.. తన బొమ్మ థియేటర్లో పడింది. మరి నటుడికి ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిదిగా ఉంటుంది..
ఇప్పుడు అదే ఫీల్‌లో ఉన్నాడు నటుడు సుహాస్.. తాను హీరోగా నటిస్తు్న్న రెండో చిత్రం రైటర్ పద్మభూషణ్ ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. విజయవాడలోని తనకు ఇష్టమైన థియేటర్ రాజ్ యువరాజ్‌లో ప్రీమియర్ షో వేశారని ఎంతో ఆనందంగా చెబుతున్నాడు సుహాస్.
ఈ నేపథ్యంలో నటుడిగా తన ప్రయాణం ఎలా మొదలైందో గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు. యూట్యూబ్‌తో కెరీర్ మొదలు పెట్టి నటుడిగా తన ప్రయాణం కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.
అబ్బో ఎక్కడి నువ్వు ఎక్కడికి వచ్చేశావురా సుహాసూ.. సినిమాలు తప్ప పుస్తకాలు పట్టించుకోపోవడం, కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లడం, టికెట్ కోసం లైన్లో నిలబడి చొక్కాలు చింపేసుకోవడం.. ఇవన్నీ నాన్నకు తెలసి బెల్ట్ తెగేలా కొట్టడం.. సినిమా ఛాన్స్ కోసం చెప్పులు అరిగేలా తిరగడం,
వచ్చిన అరకొర వేషాలతో కడుపు నిండక, భవిష్యత్తు కనపడక, కళ్లు నీటితో నిండిపోవడం, యూట్యూబ్ నుంచి దూరంగా, హీరోగా మొదటి సినిమా వచ్చింది అనుకునేలోపే వెండి తెర వెయిటింగ్‌లో పడి ఓటీటీలో బ్లాక్ బస్టర్ కొట్టడం.. దానికి జాతీయ అవార్డు రావడం..
ఫైనల్‌గా విజయవాడకు దూరంగా, సినిమాకు దగ్గరగా.. సుమారు పదేళ్ల ప్రయాణం తర్వాత.. ఏదో అద్భుతం జరిగినట్లు ఎక్కడైతే నటుడు కావాలన్న నా ఆలోచన మొదలైందో అక్కడే నా మొదటి థియేటర్ రిలీజ్, మొదటి ప్రీమియర్ పడటం.. అబ్బో ఈ ఫీలిగ్ ఏంటో మామూలుగా లేదుగా సుహాసూ అని రాసుకొచ్చాడు.
యూట్యూబ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. పడి పడి లేచే మనసు, మజిలి, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక సుహాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ కలర్ ఫోటో తీశారు డైరక్టర్ సందీప్ రాజ్..
ఈ చిత్రం కరోనా కారణంగా థియేటర్‌లో రిలీజ్ కాకపోయినా ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జాతీయ అవార్డునీ సొంతం చేసుకుంది. తాజాగా రైటర్ పద్మభూషణ్ అంటూ థియేటర్లలో సందడి చేయనున్నాడు సుహాస్ ఫిబ్రవరి 3వ తేదీన. ఈ చిత్రం కూడా అతడికి మంచి విజయాన్ని అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సుహాస్ శ్రేయోభిలాషులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com