'కెప్టెన్ ఆఫ్ ది హిట్స్'.. వరుసగా 16 హిట్లిచ్చిన ఏకైక ఇండియన్ డైరెక్టర్ 'కోదండరామిరెడ్డి' స్పెషల్

కెప్టెన్ ఆఫ్ ది హిట్స్.. వరుసగా 16 హిట్లిచ్చిన ఏకైక ఇండియన్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి స్పెషల్
చిరును ప్రేక్షకుల గుండెల్లో ఖైదీని చేసిన ఆ దర్శకత్వ మాయాజాలం గుర్తొస్తుంది..

సినిమా పరిశ్రమలో ఒకరి పేరు చెప్పగానే అనివార్యంగా మరొకరి పేరు వినిపించడం అరుదు. అలాంటి అనివార్యతను తన సినిమాలతో క్రియేట్ చేసిన దర్శకుడు ఏ కోదండ రామిరెడ్డి.. కోదండ రామిరెడ్డి పేరు వినగానే ఆటో మేటిక్ గా చిరంజీవి గుర్తొస్తాడు. చిరును ప్రేక్షకుల గుండెల్లో 'ఖైదీ'ని చేసిన ఆ దర్శకత్వ మాయాజాలం గుర్తొస్తుంది.. ఒక్క చిరంజీవి మాత్రమే కాదు.. అందరు స్టార్ హీరోలతో మాస్ కే జోష్ వచ్చేలాంటి సినిమాలు చేసిన మాసివ్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి. వరుసగా 16 హిట్లిచ్చిన ఏకైక ఇండియన్ డైరెక్టర్.. ఇవాళ ఈ మోస్ట్ సక్సెస్ ఫుల్ అండ్ సూపర్ హిట్ డైరెక్టర్ బర్త్ డే...



సుజాత టైటిల్ పాత్రలో శ్రీధర్, చంద్రమోహన్ నటించిన 'సంధ్య' అనే సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు కోదండరామిరెడ్డి. అంతకు ముందు విక్టరీని ఇంటి పేరుగా మలచుకున్న వి మధుసూధనరావు వద్ద శిష్యరికం చేశారు.. తర్వాత దర్శక మాస్ మహరాజ్ రాఘవేంద్రరావు వద్దా శిష్యరికం చేశారు.. అలా సినిమాపై అనుభవం సంపాదించుకున్న తర్వాతే 'సంధ్య'తో కోదండరామిరెడ్డి అనే ఈ దర్శక సూరీడు వెలుగులోకి వచ్చాడు..

అప్పుడే హీరోలు కావాలని ప్రయత్నాలు చేస్తున్న చిరంజీవి, మోహన్ బాబుల కాంబినేషన్ లో రెండో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఆ సినిమా కిరాయి రౌడీలు.. ఫస్ట్ సినిమా క్లాస్ అయినా నెక్ట్స్ మాస్ సినిమాతో బానే మెప్పించారు. తర్వాత తెలుగులో హిట్ అయిన గోపాల్రావుగారి అమ్మాయి సినిమాను తమిళంలో రీమేక్ చేశారు. ఈ మూడు సినిమాల తర్వాతే న్యాయం కావాలి సినిమాతో కోదండరామిరెడ్డి, చిరంజీవిల క్రేజీ కాంబినేషన్ మొదలైంది..



తెలుగులో చాలామంది నవలానాయకులను చూశాం.. అయితే నవలాదర్శకుడిగా కోదండరామిరెడ్డినే చెప్పాలి.. కొన్ని దశాబ్ధాల క్రితం తెలుగు పాఠకులను ఉర్రూతలూపిన యండమూరి వీరేంద్రనాథ్ నవలలను సినిమాలుగా మలచాడు కోదండరామిరెడ్డి.. ఈ ఇద్దరికీ కామన్ గా చిరంజీవి హీరోగా చేరడంతో ఈ త్రయం తెలుగు తెరను ఊపేశారనే చెప్పాలి.. ఈ ముగ్గురి కలయికలో, అలాగే కోదండరామిరెడ్డి, చిరు కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో 95శాతం హిట్లున్నాయి..

అభిలాష తర్వాత కోదండరామిరెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో కమర్షియల్ సినిమా లెక్కలను బ్లాస్ట్ చేసేలా ఖైదీ వచ్చింది. మంచి కథను ఖచ్చితమైన కమర్షియల్ లెక్కలతో సినిమాగా మలిస్తే ఎలా ఉంటుందనే దానికి సమాధానంగా ఎప్పటికీ నిలుస్తుంది ఖైదీ. ఈ సినిమాతో అప్పటి వరకూ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లోనే ఉన్న చిరంజీవి ఒక్కసారిగా ఆంధ్రుల అభిమాన కథానాయకుడయ్యారు.



చిరంజీవి గురించి చెప్పిన ప్రతిసారీ ఖైదీ గురించి చెప్పాల్సిందే.. అలాగే కోదండరామిరెడ్డి ప్రస్తావన వచ్చిందంటే అక్కడా ఖైదీ లేకుండా అది పూర్తి కాదు. అంతే కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రతి అప్ కమింగ్ హీరో ఖైదీ లాంటి సినిమా పడాలని కోరుకుంటూ ఉంటాడు.. ఇదీ చాలు.. వీరి కాంబినేషన్ లో ఖైదీ సృష్టించిన సునామీ గురించి తెలియడానికి...

ఇక వీరి కాంబినేషన్ లో వరుసగా సినిమాలు వచ్చాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో సినిమా 'ఛాలెంజ్'.. యూత్ ఎన్నో విధాలుగా మెస్మరైజ్ చేసిన ఛాలెంజ్ చిరు ది బెస్ట్ మూవీస్ లోనూ ఉంటుంది. ఇక అప్పటి నుంచి కోదండరామిరెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో కుదిరితే యండమూరి కథతో ఆడియన్స్ కథలు కథలుచెప్పుకున్న సినిమాలెన్నో వచ్చాయి..

కోదండరామిరెడ్డి అనగానే చిరంజీవి పేరు అనివార్యంగా వినిపించినా .. కేవలం చిరుకే పరిమితం కాలేదు.. ఇతర హీరోలతోనూ అదిరిపోయే హిట్స్ ఇచ్చాడు. బాలకృష్ణతో నారీ నారీ నడుమ మురారి లాంటి క్లాస్ సినిమా చేశాడు.. నాగార్జునకు ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అల్లరి అల్లుడు లాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ మాస్ హిట్ ఇచ్చాడు. అలాగే కమల్ హాసన్ తో ఒకరాధ ఇద్దరు కృష్ణుడు అంటూ కామెడీ హిట్ ఇచ్చారు. మొత్తంగా దర్శకుడిగా అందరు హీరోలతో, అన్ని రకాల సినిమాలూ చేసిన ఘనత ఆయన సొంతం..



అప్పటి స్టార్ హీరోల్లో చిరంజీవి తర్వాత బాలకృష్ణతోనూ చాలా సినిమాలు చేశారు కోదండరామిరెడ్డి.. వీరి కాంబినేషన్ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది.. బాలయ్య, చిరు ఇమేజ్ లకు అనుగుణంగా అదిరిపోయే మాస్ స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకోవడం.. వాటిని వారి స్టార్డమ్, ఫ్యాన్ క్రేజ్ ను బట్టి మాసివ్ గా మలచడంలో కోదండరామిరెడ్డి అంచనా ఎప్పుడూ తప్పలేదు..

ఇక నాగార్జున, కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలూ సూపర్ హిట్లుగా నిలిచాయి.. విక్కీదాదా, కిరాయిదాదా, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అల్లరి అల్లుడు, రాముడొచ్చాడు లాంటి సూపర్ హిట్స్ వీరి కాంబినేషన్ లో ఉన్నాయి. ఆయా హీరోల బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా స్క్రిప్ట్ ను ట్యూన్ చేసుకోవడంలో కోదండరామిరెడ్డి ప్రతిభ అద్భుతం అనే చెప్పాలి..

అయితే అప్పటి మరో స్టార్ హీరో వెంకటేష్ తో మాత్రం కోదండరామిరెడ్డి మంచి హిట్ సినిమాలు తీయలేకపోయారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన సూర్య ఐపియస్, పోకిరి రాజా లాంటి సినిమాల ఫలితాలు ఇద్దరినీ నిరుత్సాహపరిచాయి..

కోదండరామిరెడ్డి సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ బాగా ఉన్నా.. సెంటిమెంట్ నూ అద్భుతంగా పండిస్తాడు.. అటు కామెడీకీ కొదవ లేకుండా చూసుకుంటాడు.. ఇక మరో విశేషం ఏంటంటే, ఆయనకు మ్యూజిక్ సెన్స్ ఎక్కువ.. అందుకే తన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమానూ మ్యూజికల్ హిట్ అయ్యేలా చూసుకున్నాడు.. ఈ విషయంలో కోదండరామిరెడ్డిపై రాఘవేంద్రరావు ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది..

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేక్షకుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ విషయంలో ప్రేక్షకుల కంటే ముందే పరిశ్రమలోనూ అనేక మార్పులు వచ్చాయి. దీంతో కోదండరామిరెడ్డి కాలంలో ఉన్న దర్శక నిర్మాతల్లో చాలామంది సినిమాలకు దూరమయ్యారు. అయితే రామిరెడ్డికి 1994లో బాలకృష్ణతో చేసిన బొబ్బిలి సింహమే చివరి హిట్ చిత్రంగా చెప్పాలి.. ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ఆయన ఇమేజ్ కు అనుగుణంగా ఆడలేదు..



తనయుడు వైభవ్ ను హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో చేసిన 'గొడవ' ఆకట్టుకోలేదు.. అయినా అతను మంచి నటుడిగా తమిళ చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు.. ఇక కోదండరామిరెడ్డి చివరి చిత్రం ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన పున్నమి నాగు.. ఆశ్చర్యంగా ఈ సినిమా కమర్షియల్ గా బాగానే వర్కవుట్ అయింది. 2009లో వచ్చిన పున్నమినాగు తర్వాత కోదండరామిరెడ్డి మళ్లీ ఇప్పటి వరకూ మెగాఫోన్ పట్టుకోలేదు. మరి ఎలాగూ ఇప్పుడు నాటి యంగ్.. నేటి సీనియర్ హీరోల మధ్య పోటీ మళ్లీ స్టార్ట్ అవుతోంది కాబట్టి.. మరోసారి కోదండరామిరెడ్డి తన మ్యాజిక్ చూపేందుకు సిద్ధం కావాలని కోరుకుంటూ ఈ కెప్టెన్ ఆఫ్ ది హిట్స్ కి బర్త్ డే విషెస్ చెబుదాం..

- కామళ్ల బాబూరావు

Tags

Read MoreRead Less
Next Story