Tollywood Drugs : టాలీవుడ్ డ్రగ్స్ కేసును క్లోజ్ చేయనున్న అధికారులు..!

Tollywood Drugs : సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇక క్లోజ్ కానుంది. డ్రగ్స్ దిగుమతితో పాటు మనీ లాండరింగ్ వ్యవహారంలో చేసిన దర్యాప్తు సక్సెస్ కాలేదు. వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో కేసు మూసేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియను త్వరలోనే ప్రారంభించే అవకాశముంది. 2017లో ఆబ్కారీశాఖ నమోదు చేసిన కేసులతో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. సుదీర్ఘంగా సాగిన విచారణలో చెప్పుకోదగ్గ ఆధారాలేవి దొరకలేదు. ఇక ఈడీ దర్యాప్తు అదే తోవలో సాగింది.
2017 జులైలో ఆబ్కారీ అధికారులు కెల్విన్ మార్కెరాన్స్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించాడం సంచలనం రేపింది. దీంతో అప్పటి అబ్కారీ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో టాలీవుడ్‌కు చెందిన అనేక మందిని విచారించారు. డ్రగ్స్ వాడుతున్నది, లేనిది శాస్త్రీయంగా నిర్ధారించేందుకు కొందరి గోళ్లు, వెంట్రకలు సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు సాక్షులను విచారించారు. దాదాపు మూడేళ్లపాటు దర్యాప్తు చేసినా డ్రగ్స్ వాడకంపై ప్రాథమిక ఆధారాలు దొరకలేదు. ఆబ్కారీ శాఖ దర్యాప్తు ముగిసిన తర్వాత ఈడీ అధికారులు విచారణ ప్రారంభించారు. గత ఆగష్టులో మళ్లీ కొత్తగా కేసు నమోదు చేశారు. డ్రగ్స్‌తో పాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.
తెలుగు పరిశ్రమకు చెందిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రవితేజ, రానా, ఛార్మి, రకుల్‌ప్రీత్‌సింగ్ సహా మొత్తం 12 మందిని విచారించారు. వారందరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు విచారణ కొనసాగింది. ఐతే ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో కేసు మూసివేయాలని అధికారులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com