Film Chamber : కొలిక్కి రాని ఫిలిం ఛాంబర్ మీటింగ్.. మళ్లీ సమావేశమవుతామంటున్న నిర్మాతలు

Film Chamber : కొలిక్కి రాని ఫిలిం ఛాంబర్ మీటింగ్.. మళ్లీ సమావేశమవుతామంటున్న నిర్మాతలు
Film Chamber : సమావేశంలో సమస్యలపై నిర్మాతల మండలి ఎలాంటి పరిష్కారాన్ని కనుగొనలేకపోయింది.

Film Chamber : తెలుగు ఫిలిం ఛాంబర్‌లో టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. ఎగ్జిబిటర్లు,డిస్టిబ్యూటర్ల, స్టూడియో ఓనర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు..టికెట్‌ ధరల తగ్గింపు, నిర్మాణ వ్యయాలు, ఓటీటీలో కొత్త సినిమాలు వంటి విషయాలపై చర్చించారు.. అయితే ఈ సమావేశంలో సమస్యలపై నిర్మాతల మండలి ఎలాంటి పరిష్కారాన్ని కనుగొనలేకపోయింది. పైకి మేమంతా ఒక్కటే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటాం అనిచెబుతున్నా.. సమావేశం మాత్రం... వచ్చారు వెళ్లారు అన్న రీతిలోనే జరిగిందని అంటున్నారు..

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. స్టార్‌ హీరోల సినిమాలకు కూడా కష్టాలు తప్పడం లేదు. ఓ పక్కనిర్మాణ వ్యయం పెరిగిపోతుండటం, మరోపక్క ప్రభుత్వాలు ఆంక్షలు పెడుతుండటం నిర్మాతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో సినిమా షూటింగ్‌లు ఆపి పరిస్థితులను పునః సమీక్షించుకోవాలని ప్రొడ్యూసర్స్‌ భావిస్తున్నట్లు సమాచారం. అయితే షూటింగ్‌లు ఆపేస్తే అసలుకే మోసం వస్తుందని మరో వర్గం నిర్మాతల వాదన.

ఈ నేపధ్యంలోనే తెలుగు ఫిలిం ఛాంబర్‌లో టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. టికెట్‌ ధరల తగ్గింపు, నిర్మాణ వ్యయాలు, ఓటీటీలో కొత్త సినిమాలు వంటి విషయాలపై చర్చించారు. మరోవైపు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు,డిస్టిబ్యూటర్ల, స్టూడియో ఓనర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు నిర్మాతల మండలి సభ్యులు. సినిమా షూటింగ్‌ వ్యయం కొత్త సినిమాల విడుదలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అనుకుంటే అవేమి లేకుండానే భేటీని మమ అనిపించారు.

రెండు మూడురోజుల్లో మరోకసారి భేటీ అవుతామని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారని కొందరు ఎగ్జిబిటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తామని అంటున్నా ఇప్పటివరకు మాత్రం ఎలాంటి మార్గం లభించలేదు.

మరోవైపు ఏపీ సర్కార్ ఇండస్ట్రీని ఆంక్షలతో ఇరుకున పెట్టేస్తోందని కొందరు ఎగ్జిబిటర్లు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సినిమా టికెట్లు, బెనిఫిట్ షోల విషయంలో ఆంక్షలు విధించిందని.... రోజుకు నాలుగు ఆటలే అంటూ కండీషన్లు పెట్టిందని ప్రస్తావించారు. ప్రభుత్వ ఆంక్షల తర్వాత ఏపీలోని 1500 థియేటర్లకు గాను 400 థియేటర్లు క్లోజ్ అయ్యాయని.. పరిస్థితి ఇలానే ఉంటే భవిష్యత్‌లో మరిన్ని థియేటర్లు మూతపడక తప్పేలా లేదని సమావేశంలో కొందరు అభిప్రాయ పడ్డారు.

ఇక సినిమా కష్టాలకు అధిక టికెట్ ధరలు, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై నెపం వేయడం సరికాదని మరికొందరి వాదన. అధిక టికెట్ ధరల కారణంగానే సినిమా కలెక్షన్లు తగ్గుతున్నాయనడంలో ఎటువంటి వాస్తవం లేదని.... పెద్ద హీరోల సినిమాలకు అధిక ధరలకు టికెట్లు విక్రయించడం అనాదిగా వస్తున్న సంప్రదాయమేనని పలువురు అభిప్రాయపడ్డారు. బెనిఫిట్ షో, ప్రత్యేక షోల కోసం అభిమానులు టికెట్ రేట్ ను పట్టించుకోకుండా ఎగబడి మరీ కొనేవారని గుర్తుచేశారు కొందరు నిర్మాతలు.

Tags

Read MoreRead Less
Next Story