Sirivennela Seetharama Sastry : చేంబోలు నుంచి సిరివెన్నెల వరకు.. సీతారాముడి ప్రస్థానం ఇదే..!

Sirivennela Seetharama Sastry : ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమించారు. కిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. న్యూమోనియాతో బాధపడుతూ ఈనెల 24న కిమ్స్‌లో చేరిన సిరివెన్నెల.. ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సిరివెన్నెల మృతితో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసిన గేయ రచయితల్లో సిరివెన్నెల ఒకరు. సమాజాన్ని చైతన్య పరిచే పాటలైనా.. విరహ గీతాలు అయినా.. డ్యుయెట్‌లు అయినా.. సిరివెన్నెల పెన్నుకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఆయన రాసిన పాటలు చెవులకు స్రావ్యంగా ఉండటమే కాదు.. హృదయాన్ని ఉరకలెత్తిస్తుంది. అది సిరివెన్నెల ప్రత్యేకత. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య 'పద్మావతి'ని పేర్కొనే సీతారామశాస్త్రి తన గురువుగా శ్రీ 'వై. సత్యారావు'ని చెబుతారు
సిరివెన్నెల సినిమాతో తెలుగు సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన చేంబోలు సీతారామశాస్త్రి.. సిరివెన్నెల సీతారామశాస్త్రిగా స్థిరపడిపోయారు. ఇక అక్కడ నుంచి ఆయన ప్రయాణం.. దిగ్గర రచయితల సరసన నిలబెట్టింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి.. 1955, మే 20న విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో జన్మించారు. కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆయన.. ఆంధ్రా యూనివర్సిలో బీఏ చేశారు.
ఎంఏ చేస్తుండగా ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ నుంచి పిలుపు రావడంతో.. సినీ పరిశ్రమకు వచ్చారు. సిరివెన్నెల సినిమాకు తొలి పాట రాసిన సీతారామశాస్త్రి.. మొత్తం 3వేలకు పైగా పాటలు రాశారు. ఉత్తమ గేయ రచయితగా 11 నంది పురస్కారాలు అందకున్న సిరివెన్నెలను.. ఒక జాతీయ పురస్కారం కూడా వరించింది. ఆయన రాసిన ఎక్కువ పాటలను గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడడం విశేషం.
1986లో సిరివెన్నెలలో ఆయన రాసిన విధాత తలపున పాటకు తొలి నంది పురస్కారం దక్కింది. ఉత్తమ గేయ రచయితగా నాలుగు సార్లు దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. సినీ గేయ రచయితగా ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన సిరివెన్నెలను.. 2019లో ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఒక పాట రాసిన సిరివెన్నెల.. శ్యామ్‌సింగరాయ్‌కి చివరి సారిగా పాటలు రాశారు. దాదాపు 165 సినిమాలకు సిరివెన్నెల తన కలాన్ని అందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com