Raja Saab : పార్ట్ 2ల పిచ్చిలో టాలీవుడ్

Raja Saab :  పార్ట్ 2ల పిచ్చిలో టాలీవుడ్
X

ఒక సినిమాను చూడగానే ప్రేక్షకులు ఏదో ఒక ఫీలింగ్ తో బయటకు వస్తారు. బావుంటే ఉందని.. లేదంటే పోయిందనీ చెప్పుకుంటారు. అంతే. అంతకు మించి ఇంకేం ఆలోచించరు. మరీ రాడ్ మూవీ అయితే తీసిన దర్శకుడిని నాలుగు తిట్లు తిట్టుకుంటారు. అభిమానులైతే ఇంకాస్త ముందుకు వెళ్లి ఇంకేదో మాట్లాడుతుంటారు. అయితే సినిమాను ముక్కలు చేయడం మొదలైందిప్పుడు. ఒక పార్ట్ చూపించి రెండో పార్ట్ కూడా ఉందని చెప్పడం ప్యాషన్ గా మారింది. అవసరమా కాదా అనేది ఆలోచించడం లేదు. మా సినిమా రెండు భాగాలుగా ఉండబోతోంది అని చెప్పడం చూస్తుంటే ఇదంతా కావాలని చేస్తోన్న స్టంట్ లా కనిపిస్తోందే తప్ప.. నిజంగా ఆ కథలో అంత దమ్ముందా అంటే ఉండటం లేదు అనే చెప్పాలి.

బాహుబలి, బాహుబలి 2 తో మొదలైన ఈ ట్రెండ్ లో ఆ టైప్ లో సెకండ్ పార్ట్ కోసం వేచి చూసేలా చేసిన ఇప్పటి వరకూ రాలేదు అనే చెప్పాలి. ఆ మధ్య వచ్చిన దేవర చూసిన ఎవరైనా సరే దేవర 2 కోసం ఈగర్ గా చూస్తున్నారా అంటే సమాధానం అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్ అవసరమా అన్నారే తప్ప.. అరే ఈ రెండో భాగం ఎంత త్వరగా వస్తే అంత బావుండు అని ఎవరూ అనుకోలేదు.

తాజాగా వచ్చిన కింగ్ డమ్ చిత్రాన్ని కూడా రెండు ముక్కలుగా చేస్తున్నాం అని నిర్మాత గతంలోనే చెప్పాడు. తీరా సినిమా చూస్తే అందులో సెకండ్ పార్ట్ కు సరిపడేంత కంటెంట్ ఏముందీ అనిపించక మానదు. తన అన్నను తీసుకురావడానికి వెళ్లిన హీరో.. అతన్ని అక్కడే కోల్పోతాడు. ఇంక అతను రెండో భాగంలో చేయడానికి ఏముంటుంది..? ఏం ఉండదు.. అందుకే ప్రమోషన్స్ లో సెకండ్ పార్ట్ లో మరో పెద్ద హీరో వస్తాడు అని చెప్పాడు. ఈ కథ చూశాక ఇంకే పెద్ద హీరో అయినా ఒప్పుకుంటాడా అనేది పెద్ద ప్రశ్న. అలాగే విలన్ మొదటి కొడుకుతో పోరాటం ఉంటుందని సినిమా చివరలో మొహం చూపించకుండా షాడో వేశాడు. అదీ స్టంట్ లానే ఉంది.

ఇక సాఫీగా వెళ్లిపోతోంది అనుకుంటోన్న రాజా సాబ్ కు కూడా రెండో భాగం, మూడో భాగం ఉంటుందని చెబుతున్నాడు నిర్మాత. నిజానికి ఇది ఇప్పుడు అవసరం లేని టాపిక్. కావాలనే అభిమానులను మిస్ లీడ్ చేయడం తప్ప మరోటి కాదు. పైగా గతంలో నాగవంశీ, ఇప్పుడు రాజా సాబ్ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ చెబుతున్నది ఏంటంటే.. ఫస్ట్ పార్ట్ తో సంబంధం లేకుండానే సెకండ్ పార్ట్ ఉంటుందని. ఆ మాత్రం దానికి పార్ట్ లు అనడం దేనికి. మరో సినిమా మా బ్యానర్ లో అదే హీరో, దర్శకుడితో ఉంటుందని చెప్పుకోవచ్చు కదా అనేది సగటు ప్రేక్షకుడి ప్రశ్న.

ఏదేమైనా ఈ మధ్య కాలంలో సెకండ్ పార్ట్ కు పర్ఫెక్ట్ లీడ్ ఇచ్చిన సినిమా అంటే కొంత వరకు సలార్ మాత్రమే. మరీ భారీ హైప్ లేదు కానీ.. సెకండ్ పార్ట్ లో ప్రభాస్, పృథ్వీ రాజ్ మధ్య వైరం చూడాలనే కోరిక కొందరిలో ఉంది. మరి సలార్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కానీ.. ప్రస్తుతం టాలీవుడ్ పార్ట్ 2 పిచ్చిలో పడి కంటెంట్ కంటే ఇలాంటి కబుర్లు చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోందంటే కాదనగలమా..?

Tags

Next Story