Telugu Movies OTT : అప్పుడు మాత్రమే ఓటీటీల్లోకి రిలీజ్ చేయాలి : టాలీవుడ్ నిర్మాతలు

Telugu Movies OTT : అప్పుడు మాత్రమే ఓటీటీల్లోకి రిలీజ్ చేయాలి : టాలీవుడ్ నిర్మాతలు
Telugu Movies OTT : తెలుగు సినిమాలు ఇకపై అంత తొందరగా ఓటీటీల్లోకి రావు.

Telugu Movies OTT : తెలుగు సినిమాలు ఇకపై అంత తొందరగా ఓటీటీల్లోకి రావు. సినిమా విడుదలైన 8 వారాల తరువాతే ఓటీటీలోకి అనుమతించాలని టాలీవుడ్ ప్రొడ్యూసర్లు నిర్ణయం తీసుకున్నారు. ఓటీటీలతో ఇప్పటి వరకు ఒప్పందం కుదుర్చుకున్న సినిమాలను సైతం ఇదే రూల్‌ కిందకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు నిర్మాతలు. దీంతో ఇకపై ఏ సినిమా అయినా సరే 50 నుంచి 60 రోజుల తర్వాతే ఓటీటీలోకి రానున్నాయి. ఓటీటీ రిలీజ్‌ విషయంలో క్లారిటీ రావడంతో.. త్వరలోనే సినిమా షూటింగ్‌లు మొదలుపెడతామని దిల్‌ రాజు చెప్పుకొచ్చారు.

ఇక ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలనే దానిపైనా చర్చలు జరిగాయి. ముఖ్యంగా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్‌ ధరలు, తినుబండారాల రేట్లు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. థియేటర్లకు ప్రేక్షకులు దూరం కాకుండా ఉండాలంటే ధరలు తగ్గించాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా సినిమా నిర్మాణ వ్యయం తగ్గించే విషయంపైనా నిర్మాత మండలి చర్చించింది. దీనిపై మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌తో మాట్లాడి, ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. రెమ్యునరేషన్‌, సినిమా బడ్జెట్‌పై దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులతోనూ చర్చలు కొనసాగుతున్నాయన్నారు దిల్‌ రాజు. ముఖ్యంగా వృథా ఖర్చును తగ్గించుకుంటే.. సినిమా వ్యయం భారీగా తగ్గినట్టేనని చెబుతున్నారు. ఈ విషయాలపై కూడా వచ్చే రెండు, మూడు రోజుల్లో ఓ క్లారిటీ వస్తుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫిల్మ్‌ ఫెడరేషన్‌తో కూడా చర్చలు పూర్తయ్యాయి. సినిమా కార్మికులు అడుగుతున్న వేతనాలకు నిర్మాతలు కూడా దాదాపుగా అంగీకరిస్తున్నారని ఫెడరేషన్ చెబుతోంది. ఇక షూటింగ్స్ ఎప్పుడు మొదలుపెట్టేది.. త్వరలోనే చెబుతామని దిల్‌ రాజు ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story