Vijayendra Prasad : ఆ మాజీ సీఎంపై సినిమా తీస్తానంటే ఫ్రీగా కథ రాస్తా : రచయిత విజయేంద్రప్రసాద్

Vijayendra Prasad : కథలు రాయడంలో బాహుబలి. స్క్రీన్ ప్లే అందించడంలో సమరసింహారెడ్డి. డైలాగ్స్ కొట్టడంలో రాజన్న. వీటన్నింటికీ కథలు అందించింది ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్. ఇలాంటి రైటర్ తో కథలు రాయించుకోవడానికి నిర్మాతలు క్యూ కడతారు. ఎప్పుడెప్పుడు స్టోరీ ఇస్తారా అని పడిగాపులు పడతారు. ఆయన కథ రాయడానికి ఊ కొడితే చాలు.. బ్లాంక్ చెక్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. మరి అలాంటి రచయిత ఫ్రీగా ఓ స్టోరీ ఇస్తానంటే.. నిర్మాతలు తీసుకోకుండా ఉంటారా? అది కూడా మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవిత చరిత్ర గురించి రాస్తానంటే..? ఎందుకంటే జైభీమ్ సినిమా తరువాత ఆ రకం కథలకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది.
విజయేంద్రప్రసాద్ గురించి చెప్పడానికి మాటలు అక్కర్లేదు. ఆయన కథ అందించిన సినిమాలే ఆయనేంటో ప్రేక్షకులకు చెబుతాయి. బాహుబలి, భజరంగీ బాయిజాన్, రాజన్న, మగధీర, యమదొంగ, విక్రమార్కుడు, సింహాద్రి, ఛత్రపతి, బొబ్బిలి సింహం, జానకిరాముడు. ఇవి కొన్ని మాత్రమే. టాలీవుడ్ లైబ్రరీలో దాచుకోదగిన ఎన్నో సినిమాలకు ఆయన కలం.. కథ అందించింది.
సినిమా కథ ఎవరి గురించో, దేని గురించో ప్రేక్షకులకు అనవసరం. కానీ దానిని మనసులకు హత్తుకునేలా చెబితే చాలు.. ప్రేక్షకులు తిన్నగా థియేటర్లకు వస్తారు. బుద్ధిగా సినిమా చూస్తారు. శభాష్ అని మెచ్చుకుంటారు. అలాంటి ప్రశంసలు అందుకున్న జైభీమ్ సినిమా చూశాక.. మూవీ అంటే ఇలా తీయాలి అని అందరూ అంటున్నారు. ఆ కథను అంతలా ఆకట్టుకునేలా రాసిన రచయితకు కూడా ఆ క్రెడిట్ దక్కుతుంది. అందుకే నేటి తరానికి గుర్తు లేకపోయినా.. దామోదరం సంజీవయ్య గురించి.. ఆయన నాయకత్వ పటిమ గురించి, ముఖ్యమంత్రిగా చేసినా సరే.. ఆయన నిరాడంబర జీవితం గురించి, కచ్చితంగా వారికి తెలియాల్సిన అవసరముంది. అందుకే ఆ కథకు తన కలంతో అక్షర రూపం ఇస్తానంటున్నారు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్.
రాజమౌళి తండ్రిగా ఆయనకు ఎంత గుర్తింపు ఉందో.. సినీ రచయితగా అంతకంటే ఎక్కువగానే గుర్తింపు ఉంది. అలాంటి రచయిత దామోదరం సంజీవయ్య గురించి రాస్తానని ముందుకు రావడం మనస్ఫూర్తిగా ఆహ్వానించాల్సిన గొప్ప విషయం. సమాజహితం కోసం సినిమాలు తీయాలనుకునే నిర్మాతలు ఇప్పటికీ ఉన్నారు. అలాంటివారు ముందుకు వస్తే.. నిజంగా ఈ సొసైటీతోపాటు యువతరానికి మేలు చేసే.. ఓ గొప్ప వ్యక్తి బయోగ్రఫీని.. వెండితెరపై ఆవిష్కరించడానికి వీలవుతుంది. ఈ గోల్డెన్ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకునే ప్రొడ్యూసర్ ఎవరో కానీ నిజంగా వాళ్లు చాలా లక్కీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com