Gaddar Awards : అప్పుడు సైలెన్స్.. ఇప్పుడు సంబరాలు

టాలీవుడ్ లో రెండు రోజులుగా ఓ పెద్ద సందడి కనిపిస్తోంది. ఎప్పుడో ఆగిపోయిన ప్రభుత్వ అవార్డ్స్ ను తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి అని కాదు కానీ.. తమ వంతుగా సినిమా పరిశ్రమకు ప్రభుత్వ అవార్డ్స్ ను ప్రకటించింది. ఈ ప్రకటనలతో ఇండస్ట్రీ మొత్తం ఓ సందడి వాతావరణం కనిపిస్తోంది. అవార్డ్స్ అందుకుంటోన్న వారు, ప్రసంశించే వారితో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అవార్డ్ అందుకున్న ప్రతి ఒక్కరూ సింపుల్ గా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటున్నారు. కానీ వీరంతా నిజంగా గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇస్తాం అని చెప్పినప్పుడు ఇంత సంతోషంగా అంగీకరించారా అంటే లేదు అనే చెప్పాలి. అసలు గద్దర్ పేరుతో అవార్డెందుకు అన్నవాళ్లు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఈ అవార్డ్స్ కు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని పరిశ్రమను కోరినా పట్టించుకోలేదు. ఓ దశలో రేవంత్ రెడ్డి అసహనంగా ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు కూడా. అవార్డ్స్ పట్ల వీరి విధానాలేంటని నిలదీశాడు. అప్పుడు చిరంజీవి స్పందించాడు. రేవంత్ చెప్పిన మాటను సీరియస్ గా తీసుకుంటాం అని.. ఇండస్ట్రీతో మాట్లాడి త్వరలోనే ఓ కమిటీ ఏర్పాటు చేస్తాం అన్నాడు. అప్పుడు కూడా మిగతా ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఫైనల్ గా ముఖ్యమంత్రితో ఎందుకు అనుకున్నట్టుగానే వీళ్లంతా అవార్డ్స్ కమిటీని ఏర్పాటు చేశారు. నిజానికి చాలామందికి అసలు ఈ పురస్కారాలు ఇస్తారా అన్న క్వశ్చన్ మార్క్ కనిపించింది. మరీ ముఖ్యంగా విప్లవకారుడైన, సినిమాతో సంబంధం లేని వ్యక్తి పేరుతో అవార్డ్ ఏంటీ అని నిష్టూరాలూ పోయినవాళ్లున్నారు. అన్నీ దాటుకుని ప్రభుత్వం, పరిశ్రమ సహకారంతో అవార్డ్స్ ప్రకటించగానే.. అబ్బో తెగ సంబరాలు చేసుకుంటున్నారు. అందితే జుత్తు లేదంటే.. అనే సామెత ఇలాంటప్పుడే గుర్తొస్తుంది. ఏదేమైనా విజేతల విషయంలోనూ కొందరికి భేదాభిప్రాయాలున్నాయి. అవన్నీ ఎలా ఉన్నా.. టాలీవుడ్ మాత్రం చాలా యేళ్ల తర్వాత ‘‘ప్రభుత్వ అవార్డ్’’ అనే మాటతో పండగ చేసుకుంటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com