Mumbai cruise drugs: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఊహించని మలుపులు

Mumbai cruise drugs: బాలీవుడ్ ని షేక్ చేస్తున్న ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఆర్యన్ ఖాన్ కేసులో కీలకంగా వ్యవహరించిన సమీర్ వాంఖడేపై వస్తోన్న ఆరోపణలపై ఎన్‌సీబీ దృష్టి సారించింది. తాజాగా ఈ ఆరోపణలపై దర్యాప్తు మొదలుపెట్టింది.
రిమాండ్ లో ఉన్న ఆర్యన్ ఖాన్ ను విడుదల చేసేందుకు గోసాని ద్వారా దర్యాప్తు అధికారి సమీర్ వాంఖడే రూ.25 కోట్లు లంచం అడిగారని సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ ఆరోపించడంతో ఎన్సీబీ విచారణకు ఆదేశించింది. ఢిల్లీ నుంచి ముంబై చేరుకున్న డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ నేతృత్వంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఐదుగురు సభ్యుల బృందం విచారణ మొదలుపెట్టింది.
వాంఖడేతో పాటు స్వతంత్ర సాక్షులు ప్రభాకర్ సెయిల్, వ్యాపారవేత్త గోసావి, గోసాని స్నేహితుడు శామ్ డిసౌజా ను, షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దడ్లానీని విచారిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర మంత్రి నవాల్ మాలిక్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్యన్ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై గత కొద్ది రోజులుగా ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాల వేదికగా పలు ఫొటోలు, లేఖలు విడుదల చేస్తున్నారు. బుధవారం మరోసారి తన ఆరోపణల్ని కొనసాగించారు. నిజం తెలుసుకునేందుకు మాల్దీవుల పర్యటనను కూడా గమనించాలి అంటూ మరోసారి సమీర్ వాంఖడేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాగా ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్లపై బాంబే హైకోర్టులో వాదనలు కొనసాగాయి. లాయర్ దేశ్ ముఖ్, సీనియర్ కౌన్సెల్ అమిత్ దేశాయ్ వాదనలు ముగించారు. సమయం ముగియడంతో బెయిల్ విచారణను బాంబే హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com