Vani Jayaram Demise: వాణి జయరామ్ సినీ ప్రస్థానం
ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆవిడ, చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. తెలుగు, హింది, తమిళంతో సహా దాదాపు 14 భాషల్లో దాదాపు 8వేలకు పైగా పాటలు పాడారు. ఉత్తమ గాయినిగా మూడుసార్లు నేషనల్ అవార్డులు అందుకున్నారు. తాజాగా, భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందించింది. ఈ అవార్డును అందుకోకముందే కన్నుమూశారు.
వాణి జయరామ్ ప్రస్థానం...
వాణి జయరామ్..ఈ పేరు వినగానే మనసు మైమరచిపోయే గీతాలెన్నో మదిలో మెదులుతాయి. క్లాస్ నుంచి క్లాసికల్ సాంగ్స్ వరకూ, జానపదం నుంచి జాజ్ బీట్స్ వరకూ ఆ గాత్రంలో వింటే అమృతగీతాలవుతాయి. ఏ పాటైనా అలవోకగా..తను తప్ప మరేవరూ పాడలేరేమో అనేంత హాయిగా పాడేడమే ఆమె స్పెషాలిటీ. గాత్రం వింటే మనిషిని చూడాలనిపించేంతటి ఆ గానసరస్వతి వాణి జయరామ్.
ఎన్నో కష్టమైన రాగాలన్నీ కూడా ఐదేళ్ళ వయసులోనే నేర్చుకుని బాలమేధావి అనిపించుకున్నారు. ఆ ప్రతిభతోనే కర్నాటక సంగీతంలో పట్టు సాధించారు. చిన్నతనం నుండి హిందీ సినిమా పాటలు విని, వాటిమీద మక్కువ పెంచుకున్నారు. తను కూడా సినిమాల్లో పాటలు పాడాలని కలగన్నారు. తర్వాతి కాలంలో ఆ కలను సాకారం చేసుకున్నారు. సినిమా పాటకే మకుటమయ్యారు. సినిమా సంగీతం మాత్రమే సంగీతం కాదు అనే అభిప్రాయం ఆమెది. లలిత సంగీతం, శాస్త్రీయ, ఉప శాస్త్రీయ, జానపదం...ఇవన్నీ సంగీతంలో భాగమే అనుకున్న వాణి, ఎన్నో రకాల సంగీతాల్లో స్పెషలైజ్ చేశారు. సినీ పరిశ్రమలోకి రాకముందే భజన్స్, గజల్స్ ప్రొగ్రాములు చేశారు.
సికింద్రాబాద్‌లో పెళ్ళి...
వాణి జయరామ్ తమిళనాడు, వేలూరులోని ఓ సంగీత కుటుంబంలో పుట్టారు. వాణి తల్లి కర్నూల్‌లో పుట్టి పెరగడం వల్ల ఆమెకు తెలుగు బాగా వచ్చు. జన్మతహ తమిళియన్ అయిన వాణీ అసలు పేరు కలై వాణి. జయరాంతో పెళ్ళయిన తర్వాత వాణీజయరాంగా మారారు. వీరి పెళ్ళి సికింద్రాబాద్‌లోనే జరిగింది. వాణీ జయరాం సికింద్రాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొన్నాళ్ళు పని చేశారు.
పెళ్లి తర్వాత ముంబైలో స్థిరపడ్డ వాణీ జయరాం, భర్త ప్రోత్సాహంతో ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ దగ్గర హిందూస్తానీ క్లాసికల్, లైట్ క్లాసికల్ సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. 1970లో ప్లేబాక్ సింగర్‌గా మారారు. మొదటి చిత్రం హిందీ మూవీ 'గుడ్డీ'. ఇందులోని 'బోల్‌రే పపీ హరా' పాట తోనే నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ సినిమాకే తాన్‌సేన్ తోపాటు ఐదు అవార్డులు వచ్చాయి. ఈ ఒక్క పాటతోనే గొప్ప పేరు సంపాదించుకున్నారు.
కోదండపాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన 'అభిమానవంతులు' చిత్రంలోని 'ఎప్పటి వలె కాదురా.. నా స్వామి కాదురా అనే పాటతో వాణీజయరాం తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరేస', 'దొరకునా ఇటువంటి సేవ' పాటలతో తెలుగులో బాగా పాపులరయ్యారు. 80ల్లో తెలుగులోకి వచ్చింది వాణి గానామృతం. కె.విశ్వనాథ్, కెవి మహదేవన్ వంటి మ్యూజికల్ కాంబినేషన్ లో పాడే అవకాశం ఆమెకు రావడం..శ్రోతల అదృష్టం. తమిళ్ లో కె బాలచందర్ 'అపూర్వ రాగంగళ్' పేరు వాణి జయరాంకు పేరు తెస్తే.. తెలుగులో విశ్వనాథ్ 'శంకరాభరణం' పేరు తెచ్చింది.
ఒకరకంగా వాణీజయరామ్‌కు తెలుగులో ఇంతటి కీర్తి రావడానికి కారణం విశ్వనాథ్ చిత్రాలే. శంకరాభరణం, స్వర్ణకమలం, స్వాతికిరణం, శృతిలయలు వంటి చిత్రాలు. స్వర్ణకమలంలో ఇళయరాజా సంగీతంలో బాలుతో కలిసి పాడిన 'అందెలరవళిది' పాట సూపర్ హిట్‌గా నిలిచింది. 'శ్రుతిలయలు'లోని 'ఇన్ని రాశులయునికి' మరపురాని మరో గీతం. కె విశ్వనాథ్ స్వాతికిరణం.. వాణీజయరామ్ కెరీర్ లోనే అత్యుత్తమ చిత్రంగా నిలిచింది. వాణీ జయరామ్ అన్ మాచ్డ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు సంగీత ప్రియులు. సోలోలూ సంగీత ప్రధాన గీతాలే కాదు.. డ్యూయట్లూ చాలా స్పెషల్‌గా పాడతారు వాణీ జయరామ్. సినిమా సంగీతానికీ శాస్త్రీయ సంగీతానికీ ఉన్న లింకులు సమగ్రంగా తెల్సిన గాయని కావడంతో....ఏ పాటైన తన గాత్రంలో కొత్త సొగసులు అద్దుకుంటుంది. 'స్వాతికిరణం, పెళ్లి పుస్తకం, స్వర్ణకమలం, ఆరాధన, శృతిలయలు, సీతాకోకచిలుక, ఇది కథకాదు, గుప్పెడు మనసు, శంకరాభరణం, కరుణామయుడు, మరోచరిత్ర, అంతులేని కథ లాంటి ఎన్నో చిత్రాల్లో తన గాత్రంతో శ్రోతల్ని అలరించారు వాణీ జయరాం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com