రాధికా ఆంటీతో చాలా కష్టం.. నా సీక్రెట్స్ అన్నీ..: వరలక్ష్మీ శరత్ కుమార్

ఒడ్డు, పొడుగు, కళ్లలో కనిపించే కరుకుదనం.. అన్నీ విలన్ క్యారెక్టర్‌కి సరిగ్గా సరిపోయే ఆహార్యం.. లేడీ విలన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వరలక్ష్మి శరత్ కుమార్.. సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన రవితేజ 'క్రాక్' సినిమాలో జయమ్మగా అదరగొట్టింది. సముద్రఖనితో పొటాపోటీగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. శరత్ కుమార్ కూతురిగా తమిళ ఇండస్ట్రీకి పరిచయమైనా తన నటన ద్వారా, తన ప్రవర్తన ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
తమిళ చిత్రాలతో పాటు మలయాళం, కన్నడ, తెలుగు చిత్రాల్లో కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం క్రాక్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న వరలక్ష్మి తన సినిమా ఎంట్రీ అంత సులువుగా జరగలేదని చెప్పుకొచ్చారు. నాన్న నటుడే అయినా ఆయనకు తాను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదన్నారు.
నాకు 17 ఏళ్ల వయసున్నప్పుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'బాయ్స్ ' చిత్రంలో అవకాశం వచ్చింది. ఆడిషన్స్‌లో కూడా సెలెక్ట్ అయ్యాను. కానీ ఏజ్ తక్కువగా ఉందని నాన్న వద్దన్నారు. దాంతో ఆ సినిమాలో నటించే అవకాశం కోల్పోయాను. ఆ పాత్ర జెనీలియాను వరించింది అని చెప్పారు. అనంతరం చదువు పూర్తి చేసిన తరువాత 'పోడాపోడి' తో నటిగా పరిచయం అయ్యాను అని చెప్పారు.
మొదట్లో నేను సినిమాల్లోకి రావడం ఇష్టపడని నాన్న.. ఇప్పుడు నా నటనని చూసి మెచ్చుకుంటున్నారు. ఇక రాధికా ఆంటీ గురించి చెప్పాలంటే ఆమె నాకు ఆంటీతో పాటు ఓ మంచి ఫ్రెండ్ కూడా.. నేను నా పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన అన్ని విషయాలు ఆమెతో షేర్ చేసుకుంటాను.
చాలా మంచి వ్యక్తి. మేమిద్దరం ఎప్పుడూ చాలా సరదాగా ఉంటాం. అయితే ఆమెతో ఎప్పుడూ ఒకటే సమస్య. నా సీక్రెట్స్ అన్నీ ఏదో ఒక సందర్భంలో అందరి ఎదుట బయట పెట్టేస్తుంది. అప్పటికీ నేను ఇది సీక్రెట్ ఎవరికీ చెప్పకండి అని ఆమె దగ్గర మాట కూడా తీసుకుంటాను. అయినా ఆమె చెప్పేస్తారు అని సరదాగా అన్నారు.. అంతకు మించి ఆమెతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని వరలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com