Kaikala Satyanarayana: కైకాల మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు.. ప్రముఖుల సంతాపం

Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ మృతితో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.. కైకాల మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.. విభిన్న పాత్రల్లో నటించి, తన విలక్షణ నటన ద్వారా అభిమానుల చేత నవరస నటనా సార్వభౌమ అనిపించుకున్న మేటి నటులు సత్యనారాయణ అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యులు కైకాల సత్యనారాయణ మరణం విచారకరమన్నారు.. సత్యనారాయణ ఆరు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్టీఆర్‌తో ఆయనకున్న అనుబంధం సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువని గుర్తు చేసుకున్నారు.. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.
విలక్షణ నటనతో విభిన్న పాత్రలకు జీవం పోసిన ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాన్నారు.. కైకాల సత్యనారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కైకాల మరణ వార్త దిగ్భ్రాంతి కలిగించిందని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.. ఆహార్యం, అభినయం, ఆంగికాలతో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల సత్యనారాయణ అని గుర్తు చేసుకున్నారు.. తెలుగు సినీ వినీలాకాశం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోవడం విచారకరమన్నారు..
ఎన్టీఆర్ వంటి మహానుభావుడితో కలిసి సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కైకాల చూపించిన అభినయం ఎన్నటికీ మరువలేదన్నారు బాలకృష్ణ.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు బాలకృష్ణ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com