Kaikala Satyanarayana: కైకాల మరణం.. స్వగ్రామంలో విషాదం

Kaikala Satyanarayana: నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ అకాల మరణంతో.. ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం కైకాల స్వగ్రమం . సొంత ఊరంటే కైకాలకు ఎంతో ప్రేమ.. గ్రామ అభివృద్ధికి తన పరిచయాలతో ప్రభుత్వ నిధులు తీసుకురావడమే కాక.. లక్షలాది రూపాయల సొంత నిధులతో కౌతవరం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని బంధువులు చెపుతున్నారు. కైకాల ఆరోగ్యం కుదుటపడి అంతా బాగుందనుకున్న సమయంలో ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నామని.. బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. కైకాల మరణ సమాచారం అందుకున్న బంధువులు హైదరాబాద్ తరలి వెళ్లారు.
తన సొంత ఊరు కౌతవరమన్నా.. నాటక రంగ కళాకారుడిగా జన్మనిచ్చిన గుడివాడన్నా కైకాల సత్యనారాయణకు ఎంతో అభిమానం. కళాకారుడిగా తీరక లేని రోజుల్లో కూడా తరచూ కౌతవరం వచ్చి.. తన మిత్రులను కలుసుకునేవారని గ్రామస్థులు చెపుతున్నారు. కైకాల బాల్యం ఎక్కువగా ఊరి చెరువు చుట్టూనే పెనవేసుకొని ఉండడంతో.. ఆ చెరువంటే ఆయనకు ఎనలేని ప్రేమ ఉండదని.. కౌతవరం నుంచి ఎవరు వచ్చినా సరే చెరువు బాగోగులు అడిగి తెలుసుకునేవారని గ్రామస్థులు తెలిపారు. గ్రామ చెరువులో పెరిగిన చాపలను కైకాల అమిత ఇష్టంగా తినేవారని స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు. గ్రామంలో ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
మరోవైపు కైకాల మృతిపై సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కైకాలతో తమకున్న అనుబంధం గుర్తు చేసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com