B Saroja Devi : అలనాటి నటి బి.సరోజాదేవి కన్నుమూత

B Saroja Devi :  అలనాటి నటి బి.సరోజాదేవి కన్నుమూత
X

ఎక్కడికి పోతావు చిన్నవాడా.. నా చూపుల్లో.. చిక్కుకున్న కుర్రవాడా ..అంటూ యావత్ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రలు వేసిన బి సరోజా దేవి కన్నుమూశారు. తెలుగులో ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించిన తనకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నారామె. సరోజాదేవి పుట్టింది బెంగళూరులో. చిన్నప్పటి నుంచే ప్రఖ్యాత నాట్యగురువు పద్మశ్రీ వజ్‌హోవూర్‌ రామయ్యపిళ్ళైగారి వద్ద నాట్యం నేర్చుకుంది. ఆయన వద్దే పద్మిని, వైజయంతిమాల, ఇ.వి.సరోజ, పద్మాసుబ్రహ్మణ్యం, హేమమాలిని వంటి హేమా హేమీలైన నటీమణులు నాట్యం నేర్చుకోవడం విశేషం.

హై స్కూల్ వయసులోనే ఆమెను కన్నడ చిత్ర నిర్మాత సి. హొన్నప్ప భాగవతార్‌ తన సినిమా మహా కవి కాళిదాస చిత్రం కోసం హీరోయిన్ గా తీసుకున్నారు. మొదట ఒప్పుకోకున్నా.. భక్తి చిత్రం కావడంతో ఆమె తల్లితండ్రులు కూడా ఓకే చెప్పారు. మహాకవి కాళిదాస 1956లో విడుదలైంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డ్ వచ్చింది.

1961లో ‘కిట్టూరు చెన్నమ్మ’చిత్రం విడుదలైంది. చెన్నమ్మ నాటి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన ధీర వనిత. ఆమె పాత్రలోనే సరోజాదేవి నటించారు. ఆ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా పురస్కారం రావడం విశేషం. అలా మొదలైన సరోజాదేవి నట ప్రస్థానం దక్షిణాది మొత్తానికి చేరింది. తమిళ్ లో ఎమ్జీ రామచంద్రన్ సరసన నటించిన ‘నానోడి మన్నన్’తో సరోజాదేవికి స్టార్డమ్ మొదలైంది. అప్పటి నుంచి ఎమ్జీఆర్ తో వరుసగా నటించారు.

తెలుగులో సరోజాదేవి మొదటి చిత్రం పాండురంగ మహత్మ్యం. కమలాకర కామేశ్వరరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నటించమని ఎన్టీఆరే స్వయంగా సరోజాదేవిని కోరారట. అంత పెద్ద వ్యక్తి అడగటంతో కాదలేకపోయింది. ఆ సినిమా అఖండ విజయం సాధించింది. పాండురంగ మహత్మ్యంలో ‘నీవని నేనని తలచితిరా/నీవే నేనని తెలిపితిరా..’ అనే పాట మంచి గుర్తింపు తెచ్చిందామెకు. అక్కినేని నాగేశ్వరరావుతో పెళ్లి కానుక చిత్రంలో నటించారు.

తెలుగులో ఆత్మబలం, పెళ్ళికానుక, కృష్ణార్జున యుద్ధం, సీతారామ కల్యాణం, జగదేకవీరుని కథ, రామాంజనేయ యుద్ధం, దాగుడుమూతలు, పండంటి కాపురం, భాగ్యచక్రం, రహస్యం, మాయని మమత వంటి చిత్రాల్లో తిరుగులేని నట కౌశలంలో ఆబాలగోపాలాన్ని అలరించింది సరోజాదేవి. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లతోపాటు జగ్గయ్య, కృష్ణ, శోభన్‌బాబు స్టార్స్ తో నటించింది. 2005లో వచ్చిన దేవీ అభయం ఆమె చివరి తెలుగు చిత్రం.

బి సరోజాదేవికి 1962లోనే పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డ్స్ తో భారత ప్రభుత్వం సత్కారం చేసింది. తమిళ్ నుంచి కళైమామణి, కర్ణాటక ప్రభుత్వం నుంచి రాజ్ కుమార్ లైఫ్ టైమ్ ఎఛీవ్మెంట్ అవార్డ్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2009లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ తో పాటు ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ పురస్కారాలు అందుకున్న బి సరోజాదేవి ఈ సోమవారం (14.07.2025 ) 87 యేళ్ల వయసులో వయో సంబంధిత సమస్యలతో బెంగళూరులో కన్నుమూశారు.

- బాబురావు. కామళ్ల

Tags

Next Story