Vijay Antony : విజయ్ ఆంటోనీ భద్రకాళి మూవీ రివ్యూ

Vijay Antony :  విజయ్ ఆంటోనీ భద్రకాళి మూవీ రివ్యూ
X

రివ్యూ : భద్రకాళి

ఆర్టిస్ట్స్ : విజయ్ ఆంటోనీ, వాగై చంద్రశేఖర్, తృప్తి రవీంద్ర, సునిల్ కృపలానీ, సెల్ మురుగన్, రియా జీతు తదితరులు

ఎడిటర్స్ : రేమండ్ డెరిక్ క్రాస్టా, దిన్సా

మ్యూజిక్ : విజయ్ ఆంటోనీ

సినిమాటోగ్రఫీ : షెల్లీ ఆర్ క్యాలిస్ట్

నిర్మాతలు : విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్

దర్శకత్వం : అరుణ్ ప్రభు

బిచ్చగాడు మూవీతో తెలుగులో తనదైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోనీ. అంతకు ముందు నకిలీ, సలీమ్ వంటి మూవీస్ తో ఆకట్టుకున్నాడు. మొదటి నుంచి కంటెంట్ ఓరియంటెడ్ కథలతోనే మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే బిచ్చగాడు తర్వాత ఆ స్థాయి విజయం తెలుగులో పడలేదు. తాజాగా భద్రకాళి అంటూ వచ్చాడు. ఈ శుక్రవారం విడుదలైన భద్రకాళి విజయ్ కి 25వ సినిమా. మరి ఈ చిత్రం ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ :

కిట్టు సెక్రటేరియట్ లో పెద్ద లాబీయిస్ట్. ఓ రకంగా బ్రోకర్ అని కూడా చెప్పొచ్చు. అతని నెట్ వర్క్ చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. చాలా పెద్ద ప్రొఫైల్ ఉన్న బ్యూరోక్రాట్స్ కూడా అతని హెల్ప్ తీసుకుంటారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఐ.జి స్థాయి వ్యక్తులను కూడా ఈజీగా ట్రాన్స్ ఫర్ చేయించగలడు. మరోవైపు పొలిటీషీయన్స్ కు సంబంధించి బ్లాక్ మనీని సులువుగా వైట్ చేస్తాడు. మాజీ జడ్జ్ ల డబ్బులను మెయిన్టేన్ చేయగలడు. అయితే ఇలాంటివి చేస్తున్నప్పుడు కొంత మొత్తంలో పర్సెంటేజ్ తీసుకుంటాడు. ఈ డబ్బుతో కొన్ని చారిటీస్ చేస్తూ మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తాడు. ఆ క్రమంలో ఆల్రెడీ పెళ్లై విడాకులు తీసుకున్న వేద (తృప్తి రవీంద్ర)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అతని నెట్ వర్క్ వల్ల ఓ కేంద్రమంత్రి ఇష్యూలో తలదూరుస్తాడు. ఆమెకు పర్సనల్ లాబీయిస్ట్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన అభ్యంకర్ శంకర్ ఈ మేటర్ లో ఇన్వాల్వ్ అవుతాడు. తర్వాత కిట్టూ ఓ పెద్ద బ్రోకర్ అని.. 6వేల కోట్లకు పైగా ఫ్రాడ్ చేశాడని తేల్చి పోలీస్ ల ముందు పెడతాడు. మరి నిజంగా కిట్టూ ఎవరు..? ఎందుకు ఇదంతా చేస్తున్నాడు..? అతని మోటివ్ ఏంటీ..? అభ్యంకర్ అసలు టార్గెట్ ఎవరు..? అనేవి మిగతా సినిమా.

ఎలా ఉంది..?

విజయ్ ఆంటోనీ ఇంతకు ముందు కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీస్ చేశాడు. కానీ ఇది వాటికి పూర్తి భిన్నం. కరెప్షన్ అనేది సినిమాకు ఎప్పుడూ కమర్షియల్ ఫార్మాట్. బట్ భద్రకాళిలో కరెప్షన్ ఈ దేశాన్ని ఎలా నాశనం చేస్తుంది..? యువత కళ్లను ఎలా కప్పి పెడుతున్నారు..? వారిని రకరకాల మత్తుల్లో ఎలా ముంచుతున్నారు..? అసలు ఈ దేశంలో జరిగే అనేక రాజకీయ నిర్ణయాలను ప్రశ్నించే వారే లేకుండా ఎలా చేస్తున్నారు..? దేశం పట్ల బాధ్యత లేకుండా ప్రజలను ఒక రకమైన మత్తులోకి ఎలా దించుతున్నారు అనే అంశాలను అత్యంత ప్రభావవంతంగా చెప్పాడు దర్శకుడు అరుణ్. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫాస్ట్ పేస్ లో అద్భుతమైన ఇంటెన్సిటీతో సాగుతుంది. విజయ్ ఆంటోనీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంది.

సెకండ్ హాఫ్ లోనే దర్శకుడు ‘అసలు’కథలోకి వెళతాడు. ప్రశ్నించడం ఎంత అవసరం అనేది విజయ్ ఆంటోనీ చైల్డ్ హుడ్ ఎపిసోడ్ లో సెకండ్ హాఫ్ కు బలమైన పునాది వేస్తాడు. తమిళ్ మూవీస్ లో సహజంగా కనిపించే అప్రెస్డ్ లైన్ నుంచి అన్ని వర్గాల నుంచి ప్రశ్నించే తత్వం పెరగాలని కిట్టూకి చిన్నప్పటి నుంచే అతన్ని పెంచిన వ్యక్తి బోధించడం.. దాన్ని అతను అక్షరాలా పాటించడం కోసమే ఇదంతా చేస్తున్నాడు అనే కోణం అదిరిపోయింది. సెకండ్ హాఫ్ లో రామ్ పాండే అనే పోలీస్ ను పిలిపించి కిట్టూను పట్టుకున్న తర్వాత సాగే సన్నివేశాలు కాస్త నీరసంగా కనిపిస్తాయి. బట్ చివరి అరగంట మాత్రం అదిరిపోతుంది. ఈ క్రమంలో వచ్చే స్పీచ్ లు కొందరికి నచ్చకపోవచ్చు. కానీ కేంద్ర స్థాయి నుంచి గల్లీ స్థాయి వరకూ పొలిటీషియన్స్ నుంచి బ్యూరోక్రాట్స్, మీడియా ఎంత దారుణంగా అమ్ముడు పోయింది.. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ల పేరుతో కొందరు ఈ దేశాన్నే ఎలా నాశనం చేస్తున్నారు.. ఇవన్నీ చూస్తూ కూడా ప్రశ్నించాల్సిన యువత పట్టించుకోకపోవడం వల్ల.. ఈ దేశం ఎంత వెనక్కి వెళ్లబోతోంది.. పేదరిక నిర్మూలన అసాధ్యంగా ఎలా మారుతుంది వంటి అంశాలను ఓ రకంగా చూస్తున్నంత సేపూ భయం కలిగేలా చేయడంలో దర్శకుడు వంద శాతం సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ప్రపంచంలో అనేక దేశాలు కార్పోరేట్ శక్తుల్లో బంధీలుగా మారిపోయాయి అనే అంశాన్ని చాలా గొప్పగా ఆవిష్కరించాడు. ‘ప్రజాస్వామ్య దేశంలో పైనున్న వాడే కిందున్న వాడిని చూసి భయపడాలి’ అనే పాయింట్ ఈ కథకు మూలం అనుకోవచ్చు.

ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇంటెన్స్ తో గ్రిప్పింగ్ గా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కొంత లాగ్ అవుతున్నట్టు.. కథను విడిచినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా హీరోను నెలల పాటు బంధించినా.. ఒక రోజు సడెన్ గా అతను నిజం చెప్పడం, పోలీస్ స్టేషన్, కోర్ట్ కు అటెండ్ అయ్యే లో ఇంటెన్సిటీ మిస్ అవుతుంది. అలాగే సినిమాటిక్ లిబర్టీస్ ను కాస్త ఎక్కువే వాడేసుకున్నారనిపిస్తుంది.

నటన పరంగా చూస్తే విజయ్ ఆంటోనీకి ఇది టైలర్ మేడ్ రోల్. ఆ ఇంటెన్సిటీని పర్ఫెక్ట్ గా చూపించాడు. ఇక అభ్యంకర్ పాత్రలో ఒకప్పటి హీరో కన్నన్ ఆ పాత్ర రేంజ్ నే తన నటనతో మార్చేశాడు. సెంట్రల్ మినిస్టర్ గా చేసినావిడ ప్రస్తుతం ఉన్న ఒక మంత్రిని ఇమిటేట్ చేసినట్టు కనిపిస్తుంది. బాగా చేసింది. హీరోయిన్ తృప్తి పాత్ర పరమితం. పర్ఫెక్ట్ గా చేసింది. విజయ్ కి ఫ్రెండ్ గా చేసిన సెల్ మురుగన్ సినిమా ఆద్యంతం ఆకట్టుకున్నాడు. అలాగే హీరోను చిన్నప్పుడు పెంచిన పాత్రలో మరో మాజీ తమిళ్ హీరో వాగై చంద్రశేఖర్ సైతం అదరగొట్టాడు. రామ్ పాండే పాత్రలో నటించినతను బాగా చేశాడు.కానీ అతని పాత్రను ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేయాల్సింది అనిపిస్తుంది. ఇతర పాత్రలన్నీ ఓకే.

టెక్నికల్ గా విజయ్ ఆంటోనీ మ్యూజిక్ హైలెట్ గా కనిపిస్తుంది. పాటలు బావున్నాయి. అంతకు మించి బ్యాక్ గ్రౌండ్ అద్దిరిపోయింది. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేయాల్సింది. తెలుగు వెర్షన్ కు భాష్యశ్రీ అందించిన డైలాగ్స్ చాలా చాలా బావున్నాయి. పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. ఇది తెలుగు సినిమానే అన్నంత పవర్ ఫుల్ గా తెలుగు రైటింగ్ కూడా కనిపిస్తుంది. విజయ్ ఆంటోనీయే నిర్మించిన ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్ గా ఉన్నాయి. విజయ్ ఇంతకు ముందు సినిమాల కంటే ఇది ఇంకాస్త రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో కనిపించడం విశేషం. దర్వకుడు అరుణ్ ప్రభు గత సినిమాలు సొసైటీ నుంచి తీసుకున్న కథలే కనిపిస్తాయి. ఈ సారి మాత్రం పొలిటికల్ థ్రిల్లర్ తో అద్భుతం అనిపించే కంటెంట్ తో వచ్చాడు. కాకపోతే ఈ తరహా కథలు తెలుగు వారికి ఏ మేరకు నచ్చుతాయి అనేది ప్రశ్నార్థకం. బట్ దేశం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని మాత్రం చెప్పొచ్చు.

ఫైనల్ గా : బ్రిలియంట్ పొలిటికల్ థ్రిల్లర్

రేటింగ్ : 3/5

- బావురావు కామళ్ల

Tags

Next Story