తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో వివేక్ అంత్యక్రియలు

ప్రముఖ కమెడియన్ వివేక్ అంత్యక్రియలు కాసేపట్లో ముగియనుంది. అశేష అభిమాన జనసందోహం మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. తమిళనాడు ప్రభుత్వం అధికార లాంఛనాలతో వివేక్ అంత్యక్రియలను నిర్వహిస్తోంది. అంతకుముందు.. వివేక్ పార్దీవదేహాన్ని కడసారి చూసేందుకు కోలీవుడ్, టాలీవుడ్ కదిలివచ్చింది. ప్రముఖ నటీనటులు.. రజనీకాంత్, కమల్‌హాసన్, శరత్‌కుమార్, విజయ్, విక్రమ్, అజిత్, సూర్య, జ్యోతిక, నాజర్, నటీ త్రిష ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమ అభిమాన నటుడిని చివరిచూపు కోసం భారీగా ప్రజలు, అభిమానులు తరలివచ్చారు.
ఎన్నో చిత్రాలతో అలరించిన వివేక్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో ఒక్కసారిగా తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. గురువారం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వివేక్ శుక్రవారం ఉదయం తన ఇంట్లో శ్వాస ఆడడం లేదని చెబుతూనే కిందపడి స్పృహ కోల్పోయారు. వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. గుండెపోటు రావడంతోనే పరిస్థితి విషమించి.. చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఆరేళ్ల ముందు వివేక్ కుమారుడు డెంగీ జ్వరంతో మృతి చెందారు. వివేక్ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
కమెడియన్‌గా తనదైన గుర్తింపు సంపాదించుకున్న వివేక్‌కు తమిళనాట చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టీవీ హోస్ట్‌గా అబ్దుల్ కలాం, ఏ.ఆర్.రెహమాన్ వంటి వారితో అద్భుతమైన ఇంటర్వ్యూలను చేసి మెప్పు పొందారు. వివేక్ పద్మశ్రీ అవార్డు గ్రహీత. వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు ముందుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహించే అవగాహనా కార్యక్రమాలకు తన వంతు సాయం అందించేవారు. అగ్ర హీరోలైన రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్, విజయ్, అజిత్ తదితరుల చిత్రాల్లో నటించారు. ఆయన్ను ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ వెండితెరకు పరిచయం చేశారు. సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించారు వివేక్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com