Vrushaha : మైసూరులో రఫ్పాడించేస్తోన్న మలయాళీ మెగాస్టార్

Vrushaha : మైసూరులో రఫ్పాడించేస్తోన్న మలయాళీ మెగాస్టార్
X
మైసూర్ లో 'వృషభ' యాక్షన్ సీన్స్.. సెట్స్ పై అడుగుపెట్టిన మోహన్ లాల్

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా కలిసి ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'వృషభ'. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం మైసూరులో షూటింగ్ జరుపుకుంటోంది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ల కోసం నటుడు మోహన్ లాల్ సెట్స్ పై అడుగుపెట్టారు. తాజాగా ఆయన హెలికాప్టర్ లో మైసూరు చేరుకున్నారు. హెలికాప్టర్ లో మోహన్ లాల్ జర్నీకి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత నిక్ తుర్లో వృషభ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడంతో సినిమా రేంజ్ మరింత పెరిగింది. ఈ సినిమాకు నందకిశోర్ దర్శకుడి వ్యవహరిస్తున్నారు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిలింస్, ఏవీఎస్ స్టూడియోస్ వంటి బాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నాయి. కాగా ఈ మూవీలో మోహన్ లాల్, రోషన్ మేకా తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. శ్రీకాంత్, షనాయా కపూర్, జహ్రాఖాన్, రాగిణి ద్వివేది తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ద్విభాషా చిత్రంగా రాబోతున్న 'వృషభ' సినిమా షూటింగ్ ప్రస్తుతం మలయాళం, తెలుగులో ఒకేసారి చిత్రీకరించబడుతోంది. అంతే కాకుండా రానున్న రోజుల్లో ఈ చిత్రాన్ని ఇతర భారతీయ ప్రధాన భాషల్లోకి డబ్బింగ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్ షెడ్యూల్‌ను సజావుగా జరిగేలా చూసేందుకు, మేకర్స్ సెట్ నిర్మాణ నమూనాను ప్రదర్శించే ఓ వీడియోను విడుదల చేశారు. చిత్రీకరణ సమయంలో అనుసరించాల్సిన సాంకేతిక అంశాలు, పరికరాలు మరియు ప్రోటోకాల్‌లతో సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలో ఇది సహాయపడుతుంది. హాలీవుడ్ చిత్రాలతో సమానంగా రూపొందించబడిన మొదటి భారతీయ చిత్రాలలో వృషభ ఒకటిగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత నిక్ తుర్లో అన్నారు. 'వృషభ' టీమ్‌లో చేరడం తమ అదృష్టమని చెప్పారు. ప్రతి సినిమా తనకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని, తాను ఏదో ఒకటి నేర్పిస్తుందని తెలిపారు. 'వృషభ'తో ఈ అనుభవం అసాధారణంగా ఉంటుందని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని నిక్ తుర్లో ఆనందం వ్యక్తం చేశారు.

Next Story