Vyooham Teaser 2 : ఏపీ రాజకీయాలను షేక్ చేసేలా ‘వ్యూహం’ టీజర్
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో, పలు పోస్టులతో వార్తల్లో నిలిచే కాంట్రవర్శియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ మూవీ 'వ్యూహం'తో వస్తున్నవిషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్స్ ను మేకర్స్ విడుదల చేశారు. కాగా తాజాగా 'వ్యూహం' టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రియతమ జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం తర్వాత చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఈ 'వ్యూహం' సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ నటిస్తున్నారు. కుట్రలకు, ఆలోచనలకు మధ్యలో అసమాన్యుడిగా ఎదిగిన నాయకుని కథే 'వ్యూహం' అని, ఆ నాయకుడే వైఎస్ జగన్ అని ఇప్పటికే వర్మ తెలిపారు. రెండో టీజర్‌లో నాయకునిగా జగన్ ఎదిగిన క్రమాన్ని చూపించారు. 'నిజం తన షూ లెస్ కట్టుకునే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుంది' అని జగన్ ఆవేదన చెందిన సందర్భాన్ని కూడా ఇందులో చూపించారు.
ఇక ఈ టీజర్ విషయానికొస్తే.. వైఎస్ కుటుంబంలో జరిగిన పరిస్థితులతో పాటు ప్రత్యర్థి రాజకీయ శిబిరాల్లో జరిగిన వ్యూహాలను కూడా 'వ్యూహం'లో రామ్ గోపాల్ వర్మ చూపించినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. 'ఎప్పుడో ఒకప్పుడు మీరు కల్యాణ్ (పవన్ కల్యాణ్)ను కూడా వెన్నుపోటు పొడుస్తారుగా' అని అడిగితే 'వాడికి అంత సీన్ లేదు. తనని తానే పొడుచుకుంటాడు' అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు ఈ టీజర్ లో చూపించారు. ఈ డైలాగ్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. దాంతో పాటు జగన్ అరెస్టు, కొత్త పార్టీ ఏర్పాటు సహా పలు అంశాలను కూడా ఇందులో చూపించారు. రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంతో మొదలైన ఈ టీజర్ లో.. వైఎస్సార్ మరణం తర్వాత ఏం జరిగింది? ఎవరి రియాక్షన్ ఏంటి? జగన్ ను కొనడానికి పార్టీ పెద్దలు రావడం, అందుకు తను ఒప్పుకోకపోవడంతో అరెస్టు చేయడం, ఆ తర్వాత జగన్ పార్టీ పెట్టడం లాంటివి చూపించారు. ఇక “నేనలా చేయడానికి చంద్రబాబుని అనుకున్నావా?” అనే డైలాగ్ ఫస్ట్ టీజర్ లో హైలెట్ గా నిలిచింది.
'వ్యూహం' చిత్రీకరణ 50 శాతానికి పైగా పూర్తి అయ్యిందని, అతి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత దాసరి కిరణ్ తెలిపారు. కాగా 'వ్యూహం'లో వైఎస్ భారతీ పాత్రలో మానస నటిస్తున్నారు. ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖా సురేఖ, వాసు ఇంటూరి, కోటా జయరాం తదితరులు నటిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com