ఓటీటీలోనూ ప్రేక్షకుల చేత ఓట్లు వేయించుకున్న సమంత.. ఫ్యామిలీ మేన్-2తో
ఏ రోటికాడ ఆ పాట పాడాలి అంటారు. ఈ విషయంలో మన హీరోయిన్లు కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వారి కన్ఫ్యూజన్ కు ఓ క్లారిటీ ఇచ్చింది సమంత. యస్.. సినిమాకు వెబ్ సిరీస్ కు మధ్య ఉన్న తేడాను ఇప్పటి వరకూ ఆ ఫార్మాట్ లో రాణించలేకపోయిన హీరోయిన్లకు ఫ్యామిలీ మేన్ -2తో చూపించింది. శామ్ కంటే ముందు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ లోనూ చాలామంది భామలు ఓటిటిల్లోకి వెళ్లినా ఎవరూ సక్సెస్ కాలేదు. కారణం ఏంటో తెలుసా..?
హీరోయిన్ అంటే గ్లామర్ డాళ్ అనే మాట కొన్నాళ్లుగా మారిపోతోంది. కథల్లో కీలకమైన పాత్రలు చేస్తున్నారు. మరికొందరు టాలెంటెడ్ బ్యూటీస్ అయితే కథలనే మోస్తున్నారు. ఇది సినిమా వరకూ ఆకట్టుకుంటుంది. అయితే వెబ్ సిరీస్ ల్లో చాలా తేడాలుంటాయి. ఈ సిరీస్ లు చూసే ఆడియన్స్ టేస్ట్ కూడా సినిమా ఆడియన్స్ టేస్ట్ కంటే భిన్నంగా ఉంటుంది. ఆ విషయంలో సక్సెస్ అయితేనే రెండు ఫార్మాట్స్ లోనూ ఆకట్టుకుంటారు. ఆ తేడా తెలియకే ఇప్పటి వరకూ వెబ్ సిరీస్ లు చేసిన హీరోయిన్లంతా ఫెయిల్ అయ్యారు.
సౌత్ లో ఓటిటిలో అడుగుపెట్టిన తొలి బ్యూటీగా కీర్తిసురేష్ నే చెప్పాలి. కాకపోతే తన సినిమా ఓటిటిలో విడుదలైంది. అందుకే తను కొంత మినహాయింపుగా అనుకోవచ్చు. బట్ ఆ తర్వాత కేవలం ఓటిటి టార్గెట్ గానే సిరీస్ లు లేదా.. కథలు చేసిన హీరోయిన్లంతా దారుణంగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. తెలుగులో వచ్చిన తొలి ఓటిటి కథ పిట్టకథలు. ఇందులో నటించిన హీరోయిన్లంతా దాదాపు ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఓటిటికి తగ్గ బోల్డ్ కంటెంట్ ఉన్నా.. అదేదో వాంటెడ్ గా కనిపించింది కానీ.. కథాగమనంలో భాగంగా అనిపించలేదు. అందుకే పిట్టకథలు ఫ్లాప్ అనిపించుకుంది.
ప్రధానంగా ఓటిటిలు లేదా సిరీస్ లు చేసేవాళ్లంతా సీనియర్ హీరోయిన్లే. ఇందులో భాగంగానే తమన్నా కూడా ఈ ఫార్మాట్ లోకి అడుగుపెట్టింది. తొలి ప్రయత్నంగా చేసిన లెవెంత్ అవర్ వెబ్ సిరీస్ దారుణంగా ఫ్లాప్ అయింది. పైగా ఈ లెవంత్ అవర్ ను డైరెక్ట్ చేసింది మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న ప్రవీణ్ సత్తారు కావడం విశేషం. కాకపోతే రీసెంట్ గా చేసిన నవంబర్ స్టోరీ అనే క్రైమ్ థ్రిల్లర్ మాత్రం కాస్త ఆకట్టుకుంది. అయితే రావాల్సినంత ఫేమ్ రాలేదనే చెప్పాలి.
ఇక మరో సీనియర్ బ్యూటీ కాజల్ కూడా వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టింది. కానీ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. తమిళ్ లో రూపొందిన ఆ సిరీస్ లైవ్ టెలీకాస్ట్. హారర్ కంటెంట్ తో వచ్చిన ఈ సిరీస్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దీంతో ఆ ఫార్మాట్ లో కాజల్ ముద్ర కనిపించకుండా పోయింది. దీంతో రాబోయే రోజుల్లో కాజల్ ఇక వెబ్ ఫార్మాట్ లో రాణించడం కష్టం అని తేలిపోయింది. ఈ ఫార్మాట్లో కాస్త బోల్డ్ నెస్ కూడా అవసరం కదా. బట్ కాజల్ కు పెళ్లైంది కాబట్టి. ఇక కష్టమే అనుకోవచ్చేమో..
అయితే టాప్ హీరోయిన్లే ఇలా ఫెయిల్ కావడంతో సమంత ఎంటర్ అయిన ఫ్యామిలీ మేన్ -2 వెబ్ సిరీస్ విషయంలోనూ చాలామంది డౌట్స్ పెట్టుకున్నారు. పైగా రిలీజ్ కు ముందే వివాదాలు కూడా వచ్చాయి కదా..? బట్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శామ్ అదరగొట్టింది. బోల్డ్ సీన్స్ తో పాటు తన పాత్ర తాలూకూ భావోద్వేగాలను ఎక్కడా మిస్ కాకుండా అద్భుతంగా నటించింది. వెబ్ సిరీస్ లలో ఇమేజ్ కంటే పాత్రకు సరెండర్ అయితేనే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందని ప్రూవ్ చేసింది. అంటే ఏ సీన్ దగ్గర ఆ సీన్ చేస్తేనే రాణిస్తారని చేసి చూపించింది. మరి రాబోయే రోజుల్లో సమంత రూట్ లోకి వెళ్లే హీరోయిన్లు ఎంతమంది ఉంటారో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com