Dil Raju : తెలంగాణ సినిమా కోసం దిల్ రాజు ప్లాన్స్ ఏంటీ

టాలీవుడ్ బిగ్గీ దిల్ రాజుకు కొత్త పదవి వచ్చింది. ఆ మధ్య ఆయన నిజామాబాద్ ఎమ్.పిగా పోటీ చేస్తారు అనే వార్తలు వచ్చాయి. అతను వాటిని ఖండించాడు. తాజాగా దిల్ రాజును ‘తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్’ కు ఛైర్మన్ గా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. చాలామందికి ఇది హర్షించే విషయమే. ముఖ్యంగా తెలంగాణ సినిమాకు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతపు యాసకు సినిమాలో హీరో పదవి వచ్చింది. ఇప్పుడు ఇతర యాసల వాళ్లు కూడా ఈ యాస రాకపోయినా నానా తంటాలు పడుతూ తెలంగాణలో డౌలాగ్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తెలంగాణ సినిమా కోసం నాటి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ సౌకర్యాలూ ఇవ్వలేదు. ప్రోత్సహకాలూ అందించలేదు. కొందరు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అని పెట్టుకుని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పై ఆధిపత్యం చేయాలని చూశారు. కానీ సాధ్యం కాలేదు. తెలంగాణ వాడిగా దిల్ రాజు తెలంగాణ వారిని చాలా వరకూ ప్రోత్సహించాడు అనే చెప్పాలి. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి దర్శకులు ఆయన క్యాంప్ నుంచే వచ్చారు. ఇప్పటికీ చాలామందిని ఎంకరేజ్ చేస్తుంటాడు.
2023లో ఆయన నిర్మించిన బలగం ఈ ప్రాంతపు అస్తిత్వాన్ని, ఆత్మను ఆవిష్కరించింది. ఇక్కడి మట్టి మనుషుల మమతలు, నమ్మకాలను వెలుగులోకి తెచ్చింది. దశాబ్దాల తర్వాత జనం ఊరి మధ్యలో తెరబొమ్మలు కట్టినట్టుగా టివిలు పెట్టుకుని చూసి మరీ విలపించారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి మూవీ రాలేదు అనే చెప్పాలి. అయితే తెలంగాణ సినిమా కంటూ ప్రత్యేకమైన సౌకర్యాలు అవసరమైన సందర్భం ఇది. ఈ ప్రాంతపు ప్రతిభను వెలికితీయాల్సిన అవసరం ఉంది. అందుకోసం కొన్ని ప్రోత్సహకాలూ కావాల్సి ఉంది. ఈ మేరకు దిల్ రాజు నుంచి చాలా అంచనాలే ఉంటాయి. వాటికి తగ్గట్టుగా ఆయన వద్ద తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కోసం ఏమైనా ప్రణాళికలున్నాయా.. లేదంటే ప్రభుత్వం చెప్పినట్టుగా చేసుకుంటూ వెళతారా.. లేదా.. చాలా కార్పోరేషన్స్ ఛైర్మన్స్ లాగా అలంకార పదవిగానే ఇది మిగిలిపోతుందా అనే ప్రశ్నలకు సమాధానాలు త్వరలోనే తెలుస్తాయేమో కానీ.. దిల్ రాజు నిర్మాతకు వచ్చిన ఈ అవకాశంతో అతను ఆజన్మాంతం చెప్పుకునేలాంటి గొప్ప గొప్ప మార్పులు చేసే వీలుంది. ఆ మేరకు ఆయనా ప్రయత్నిస్తారేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com