Kiran Abbavaram : ఇవేం ప్రమోషన్లు బాబోయ్

Kiran Abbavaram :  ఇవేం ప్రమోషన్లు బాబోయ్
X

కొన్ని రోజులుగా సినిమా ప్రమోషన్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వీళ్లు బెదిరిస్తున్నారో దేబిరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. 'క' మూవీ టైమ్ లో ఈ సినిమా బాగాలేకపోతే ఇండస్ట్రీ నుంచే వెళ్లిపోతా అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ఆ టైమ్ అతని కాన్ఫిడెన్స్ కు చాలామంది ముచ్చటపడ్డారు. అదే టైమ్ లో కొందరు మరీ ఇంత ఓవరాక్షన్ అవసరమా అని కూడా అన్నారు. పైగా అతను వేదికపై కాస్త సెంటిమెంట్ కురిపించడంతో కవర్ అయిపోయింది. ఇప్పుడు కూడా అదే బిల్డప్ తో కనిపిస్తున్నారు.

రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత కిరణ్ అబ్బవరం చేసిన ఫైట్లు మీకు నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి.. ఇక సినిమాలు తీయడం కూడా ఆపేస్తాను అని వీర లెవల్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి ఓ నిర్మాతగా అతను చెప్పాల్సింది ఓవరాల్ మూవీ గురించి. కేవలం ఫైట్స్ గురించి మాట్లాడ్డమేంటో అర్థం కాలేదు. ఇక కిరణ్ అబ్బవరం అయితే రాజకీయ నాయకుడి లెవల్లో కృష్ణా నగర్ లో ఉంటున్న ఓ పదిమందిని నేను చూసుకుంటా అని ''హామీలు" గుప్పించాడు. అసలు ఇవేం ప్రమోషనల్ స్ట్రాటజీలో అర్థం కాదు.

ఇక వీరికంటే మేమేం తక్కువ అన్నట్టుగా నితిన్ రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా రెచ్చిపోయాడు. ఆల్రెడీ మనోడు అనిల్ రావిపూడి స్ట్రాటజీని ఫాలో అవుతూ ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇదేమైనా తప్పా అంటే కాదు. కానీ అతను కొత్తగా ఆలోచించలేదు అనే కదా అర్థం. 'ఈ సినిమా బాగా లేకుంటే మీరంతా నన్ను వేసుకోవచ్చు..' అని వెంకీ అనేశాడు. అంత అవసరం ఏంటో అర్థం కాదు.

అలాగే ఇదే వేదికపై 'సినిమా పూర్తి అయ్యేసరికి మేము నలుగురు మాత్రమే గుర్తుంటాము... కాదంటే పేరు మార్చు కుంటా' అని రాజేంద్ర ప్రసాద్ ఓ మాట అన్నాడు. అసలు వీళ్లేం చేస్తున్నారో వీళ్లకైనా తెలుస్తోందా అనిపిస్తోంది.

ఓ సినిమా ప్రమోషన్ చేస్తున్నారా లేక రాజకీయ నాయకుల్లాగా ఎన్నికల ప్రచారాలు చేస్తున్నారా అనేది తెలియడం లేదు.ఏదైనా ఇవన్నీ కాస్త అతిగా ఉన్నాయో తప్ప వీళ్లు నిజంగా తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నట్టుగా లేదు. వీళ్లు వెళ్లిపోతాం అని బెదిరిస్తే జనం సినిమా చూస్తారా.. బాలేకపోతే వాళ్లను ఏసుకోవడానికి చూస్తారా..? లేక ఆయనేదో ఓ పదిమందిని ఆదుకుంటా అంటే రెండు రాష్ట్రాల ప్రజలు ఎగబడతారా.. సినిమాల కంటెంట్ పూర్తిగా చెప్పకపోయినా మూవీలో స్పైసీ అంశాలు ఏం ఉన్నాయో చెబుతూ ఆ మూవీపై ఇంట్రెస్ట్ వచ్చేలా చేస్తే కదా జనానికి ఆ సినిమా గురించి అర్థం అయ్యేది. అవి కాదని ఇలా పర్సనల్ బిల్డప్ స్టేట్మెంట్స్ ఇస్తే వర్కవుట్ అవుతుందా..?

Tags

Next Story