Puneeth RajKumar: పునీత్ మరణంతో.. వీరప్పన్ చేతిలో కిడ్నాప్‌కి గురైన తండ్రి ఉదంతం తెరపైకి..

Puneeth RajKumar: పునీత్ మరణంతో.. వీరప్పన్ చేతిలో కిడ్నాప్‌కి గురైన తండ్రి ఉదంతం తెరపైకి..
Puneeth RajKumar: ఈ విషాద సమయంలో పునీత్ తండ్రి రాజ్ కుమార్‌ని గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసిన ఉదంతాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

Puneeth RajKumar:పునీత్ రాజ్ కుమార్ మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. ఈ విషాద సమయంలో పునీత్ తండ్రి రాజ్ కుమార్‌ని గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసిన ఉదంతాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

వీరప్పన్ గురించి ఇప్పటివారికి పెద్దగా తెలియకపోవచ్చు కాని.. ఆ రోజుల్లో వీరప్పన్ పేరు చెబితేనే.. ఆ అడవి ప్రాంతమంతా బిక్కుబిక్కుమనేది. నిజానికి రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేయడానికి పెద్ద కారణాలు ఏమీ లేవు. అయినా సరే.. ఆయనను అపహరించాడు స్మగ్లర్ వీరప్పన్. 2000 సంవత్సరం జూలై 30 రాత్రి 9.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

రాజ్ కుమార్ తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఉన్న గాజనూరు గ్రామంలోని తన ఇంటికి వచ్చిన సందర్భంలో వీరప్పన్ మాటు వేసి ఆయనను కిడ్నాప్ చేశాడు. ఆయనతో పాటు అల్లుడు గోవిందరాజ్, బంధువు నగేష్, అసిస్టెంట్ దర్శకుడు నాగప్పను కూడా వీరప్పన్ తన వెంట తీసుకువెళ్లాడు.

రాజ్ కుమార్ కిడ్నాప్ సమయంలో తమిళనాడులో అధికారంలో ఉన్నది కరుణానిధి ప్రభుత్వం. దీంతో అప్పట్లో దేశవ్యాప్తంగా కరుణ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కారణం.. రాజ్ కుమార్‌ను కిడ్నాప్ చేసే అవకాశం ఉందని ఏడాది ముందే సమాచారం ఉన్నా.. కన్నడ కంఠీరవుడికి తగిన భద్రతను కల్పించడంలో కరుణానిధి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తండ్రి కిడ్నాప్ కు 8 నెలల ముందే మూడవ కుమారుడైన పునీత్ రాజ్ కుమార్ వివాహం జరిగింది.

రాజ్ కుమార్ ను వీరప్పన్ కిడ్నాప్ చేసిన ఉదంతంపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. నటుడికి సెక్యూరిటీని ఇవ్వడంలో తమిళనాడు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వ్యాఖ్యానించింది. వీరప్పన్ ను పట్టుకోవడానికి అప్పట్లోనే ప్రత్యేక దర్యాప్తు బృందం ఉండేది. రాజ్ కుమార్ కిడ్నాప్ విషయంలో గంధపు చెక్కల స్మగ్లర్ అయిన వీరప్పన్ స్కెచ్ ని ఆ బృంమే ముందుగా పసిగట్టింది. ఈ మేరకు 1999లో ఓసారి ప్రభుత్వాన్ని హెచ్చరించింది కూడా.

రాజ్ కుమార్ ను దాదాపు మూడు నెలలకు పైగా అడవిలో బంధించాడు వీరప్పన్. దీంతో ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచీ ఒత్తిడి పెరగడంతో వీరప్పన్ తో చర్చలు జరిపింది తమిళనాడు ప్రభుత్వం. నక్కిరన్ పత్రిక ఎడిటర్ అయిన రాజగోపాల్ ఇందులో కీలక పాత్ర పోషించారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. చర్చల సమయంలోనే వీరప్పన్ ఓ డిమాండ్ చేశాడు. తనపై ఉన్న మొత్తం 135 కేసులను ఎత్తేయాలని అడిగాడు.

అనంతరం చర్చల ఫలితమో.. మరొకటో కాని 2000, నవంబర్ 15 న రాజ్ కుమార్ ను విడుదల చేశాడు వీరప్పన్. చర్చల సమయంలో కూడా ఏమాత్రం బెట్టువీడని ఈ స్మగ్లర్.. ఆ తరువాత ఇంత సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నాడో అని అంతా ఆశ్చర్యపోయారు. అది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

రాజ్ కుమార్ కిడ్నాప్ కేసుపై 19 ఏళ్ల పాటు కోర్టులో వాదనలు నడిచాయి. ఈ కేసులో 9 మంది నిందితులుగా ఉన్నారు. కానీ ఈ కేసులో రాజ్ కుమార్ కుటుంబం ఎవరినీ నిలదీయకపోవడంతో 2018 సెప్టెంబర్‌లో వారిని నిర్దోషులుగా ప్రకటించింది న్యాయస్థానం. ఈ కేసు కోర్టులో ఉండగానే 2004లో వీరప్పన్, 2006లో రాజ్ కుమార్.. రెండేళ్ల తేడాతో మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story