Allari Naresh : ఈ వారం మూవీస్ రిజల్ట్స్ ఏంటీ..?

పుష్ప 2 తర్వాత టాలీవుడ్ లో మరో కొత్త జోష్ కనిపించలేదు. ఆ మూవీ ప్రభంజనం తెలుగులో పెద్దగా లేకపోయినా.. ఎందుకో తర్వాత వచ్చిన ఫ్రైడేస్ కళ తప్పాయి అనే చెప్పాలి. తాజాగా క్రిస్మస్ హాలిడేస్ టార్గెట్ గా ఈ శుక్రవారం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో బచ్చలమల్లి మాత్రమే స్ట్రెయిట్ తెలుగు మూవీ. మిగతావన్నీ డబ్బింగ్ బొమ్మలే. అయినా ఏ సినిమాకూ ప్రాపర్ ఓపెనింగ్స్ రాలేదంటే అతిశయోక్తి కాదు. ఉన్నంతలో హాలీవుడ్ మూవీ ముఫాసా కాస్త ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రానికి మెయిన్ రోల్ కు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడం అందుకు ప్రధాన కారణం. బట్ సినిమా తేలిపోయిందనే టాక్ వచ్చింది. అస్సలే మాత్రం ఆకట్టుకోని చిత్రంగా తేల్చారు ప్రేక్షకులు. సింపుల్ గా చెబితే సోల్ లెస్ మూవీ అనేశారు చాలామంది.
ఇక అల్లరి నరేష్ అనేక ఆశలు పెట్టుకున్న బచ్చల మల్లి అయితే జనం హాహాకారాలు పెట్టేస్తున్నారు. ప్రస్తతుం హీరోల యాటిట్యూడ్స్ మీద కథలు రాసుకుంటోన్న ట్రెండ్ సాగుతోంది కదా. అలా ఓ మూర్ఖుడి కథ అంటూ చెప్పిన ఈ మూవీకి నరేష్ నటన ఎంత బావున్నా.. ఆ పాత్రను రాసుకున్న విధానంలోనే లోపాలున్నాయని తేల్చారు ఆడియన్స్. కథనం వెరీ బోరింగ్ అంటున్నారు. ఒకట్రెండు పాటలు బావున్నా.. హీరో క్యారెక్టరైజేషన్ కు తగ్గట్టుగా హీరోయిన్ పాత్ర లేదనీ.. చూసినవాళ్లంతా నరేష్ కష్టం వృథా అయినట్టే అంటున్నారు. విశేషం ఏంటంటే.. దాదాపు పదిమంది వరకూ దర్శకులను తీసుకువచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా.. ఈ చిత్రానికి కూడా మినిమం ఓపెనింగ్స్ పడలేదు. దీనికి తోడు మొదటి ఆటకే ఫ్లాప్ టాక్ వచ్చేసింది.
2023లో వచ్చిన విడుదల 1 చిత్రానికి సీక్వెల్ గా విడుదల 2 వచ్చింది. విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో హైలీ టాలెంటెడ్ అనిపించుకున్న వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి కూడా ఓపెనింగ్స్ లేవ్. ఫస్ట్ పార్ట్ కు తెలుగులో కూడా గొప్ప అప్లాజ్ వచ్చింది.అది ఈ పార్ట్ కు ఓపెనింగ్స్ తెస్తుందనుకున్నారు కానీ.. అదేం జరగలేదు. దీనికి తోడు ఆ పార్ట్ తో పోలిస్తే ఇది ఆ స్థాయిలో లేదు అనేశారు ఆడియన్స్. కమ్యూనిజంపై వెట్రిమారన్ కామెంట్ లా ఉండటం వల్ల సాధారణ ప్రేక్షకులకు ఆ కంటెంట్ ఏంటీ అనేది అస్సలు అర్థం కాలేదు. ఈ కారణంగా విడుదల 2కు తెలుగులో కష్టం అనే టాక్ వచ్చింది. బట్ తమిళ్ లో మాత్రం సూపర్ హిట్ అంటున్నారు.
ఇక వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకునే హీరో ఉపేంద్ర చాలా కాలం తర్వాత డైరెక్ట్ చేసిన మూవీ 'యూఐ'. టైటిల్ తోనే వైవిధ్యం చూపించిన ఉపేంద్ర కంటెంట్ తో మాత్రం భయపెట్టాడంటున్నారు. చాలామందికి అతనేం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు. పైగా టైటిల్స్ లోనే మీరు ఫూల్స్ అయితే నా సినిమా చూడండి.. తెలివైన వాళ్లైతే వెళ్లిపోండి అనే డిస్ క్లెయిమర్ వేశాడు. ఇదేదో ట్రైలర్ లోనే వేస్తే సినిమాకు రాకపోయేవాళ్లం కదా.. టికెట్ కొని థియేటర్ లోకి వచ్చాక చెబితే ఎలా అంటున్నారు. కాకపోతే కర్ణాటకలో ఈ చిత్రానికి హయ్యొస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఉపేంద్ర సినిమాలను వెంటనే డిసైడ్ చేయలేం. ఈ వీకెండ్ దాటితే కానీ అసలు విషయం అర్థం కాదు.
మొత్తంగా నాలుగు సినిమాల్లో దేనికీ ఓపెనింగ్స్ రాలేదు. హిట్ టాకూ లేదు. దీంతో క్రిస్మస్ శెలవులు వేస్ట్ అయిపోయినట్టే అంటున్నారు. బట్ టాక్ ఎలా ఉన్నా.. శెలవుల్లో సినిమాలు చూస్తారు. అలా చూపించగలిగే సత్తా ఈ నాలుగింటిలో ముఫాసాకు మాత్రమే ఉంది. ఎందుకంటే పిల్లలకు ఇష్టం.. పెద్దలను బలవంతంగా తీసుకువెళతారు కాబట్టి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com