Sai Abhayankkar : ఎవరీ మ్యూజిక్ డైరెక్టర్.. ఇన్ని ఆఫర్స్ ఎలా వచ్చాయి

Sai Abhayankkar :  ఎవరీ మ్యూజిక్ డైరెక్టర్.. ఇన్ని ఆఫర్స్ ఎలా వచ్చాయి
X

ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కానీ చేతినిండా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అది కూడా టాప్ హీరోలవే కావడం విశేషం. ఈ లిస్ట్ లో అతని ఖాతాలో అల్లు అర్జున్, సూర్య, ప్రదీప్ రంగనాథన్, శింబు వంటి టాప్ స్టార్స్ సినిమాలున్నాయి. పోనీ అతనేమైనా అద్భుతాలు సృష్టించాడా అంటే అదీ లేదు. జస్ట్ ఓ మూడు నాలుగు పాటలు చేశాడు. అంతే. ఓవర్ నైట్ కోలీవుడ్ అంతా ఫేమ్ అయిపోయాడు. సీనియర్ డైరెక్టర్స్ కూడా ఇతనివైపు చూసేలా చేసుకున్నాడు ఆ పాటలతోనే. ఇంతకీ ఇతనెవరో చెప్పలేదు కదూ.. సాయి అభయంకర్. మ్యూజిక్ డైరెక్టర్ గా లేటెస్ట్ సెన్సేషన్. అఫ్ కోర్స్ అతని కుటుంబంలోనే ఓ పేద్ద సింగర్ ఉన్నాడు. అతని తండ్రి పాపులర్ సింగర్ టిప్పు. టిప్పు తనయుడే ఈ సాయి అభయంకర్. అయితే తండ్రిలా వేరే సంగీత దర్శకుల కోసం పాడటం కాక.. తనే వేరే సింగర్స్ తో పాడించే పని చూసుకున్నాడు.

టాలెంట్ ఎవరి సొత్తూ కాదు.కానీ ప్రూవ్ చేసుకోవాల్సిన టైమ్ వచ్చేదాకా వెయిట్ చేయకూడదు. ఆ టైమ్ ను క్రియేట్ చేసుకుని ప్రూవ్ చేసుకుంటే ఆ తర్వాత కలలు కన్న ప్రపంచంలోకి సులువుగా అడుగులు వేయొచ్చు.. అని నిరూపించాడు సాయి అభయంకర్. అందుకే కేవలం 21యేళ్లకే సినిమా సంగీత ప్రపంచంలోకి అడుగులుపెట్టాడు. 2023లో అతను ‘వాలం వరవేండుమ్’ అనే ఆల్బమ్ సాంగ్ చేశాడు. ఇది సూపర్ హిట్ అయింది. 2024లో ‘కచ్చీ సేరా’, ‘ఆశా కూడా’, 2025లో ‘సిత్తిర పుత్తిరి’ అనే ఆల్బమ్ సాంగ్స్ తో సంచలనం సృష్టించాడు. ఇవన్నీ దాదాపు 150 - 200 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్నవే కావడం అతని ప్రతిభకు నిదర్శనం. ఆ ప్రతిభను వెదుక్కుంటూ అవకాశాలు వచ్చాయి.

ప్రస్తుతం లవ్ టుడే, డ్రాగన్ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ మైత్రీ బ్యానర్ లో చేస్తోన్న సినిమాకు ఇతనే సంగీత దర్శకుడు. సూర్య 45వ చిత్రంతో పాటు తాజాగా అట్లీ, అల్లు అర్జున్ కాంబో సినిమాకూ అతన్నే తీసుకున్నారు. వీటికంటే ముందే సంచలన దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన రచనలో ప్రారంభమైన ‘బెంజ్’అనే చిత్రంతో అతన్ని సంగీత దర్శకుడుగా ప్రకటించాడు. ఆ తర్వాతే ఈ ఆఫర్స్ అన్నీ వచ్చాయి. త్వరలో శింబు సినిమాకూ ఛాన్స్ రాబోతోంది. మొత్తంగా తొలి అడుగులోనే సంచలన దర్శకులు, హీరోలతో పనిచేసే అవకాశం రావడం అంత సులువైన విషయం కాదు. ప్రస్తుతం తమిళనాడులో అనిరుధ్ రవిచందర్, జివి ప్రకాష్ లకు చెక్ పెట్టబోయేది ఇతనే అనే చర్చలు జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

Tags

Next Story