Ajith Kumar : పట్టుదలను పట్టించుకునేవారే లేరా

స్టార్ హీరో సినిమా అంటే ఆడియన్స్ లో ఉండే క్రేజ్ వేరే. కానీ హీరోలు లేజీగా ఉంటే ఆ క్రేజ్ ఇతర భాషల్లో పనిచేయదు. సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యి ప్రమోషన్స్ కు నో చెప్పే హీరోలు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో తమిళ్ స్టార్ అజిత్ కుమార్ ఒకడు. అతను తమిళ్ లో కూడా తన సినిమాల ప్రమోషన్స్ కు రాడు. ఆ విషయం నిర్మాతలకు ముందే చెబుతాడు కాబట్టి అక్కడి వారికి ఇబ్బంది లేదు. కాకపోతే ఆ హీరో స్టార్డమ్ ను నమ్ముకుని ఇతర భాషల్లో విడుదల చేస్తున్నప్పుడు మాత్రం సమస్య తప్పదు. ప్రస్తుతం అజిత్ లేటెస్ట్ మూవీ ‘పట్టుదల’ పరిస్థితి ఇదే.
అజిత్, త్రిష జంటగా నటించిన విడాముయర్చి అనే చిత్రాన్ని తెలుగులో పట్టుదల పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ నెల 6నే ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీకి మగిళ్ తిరుమేని దర్శకుడు. ఈ మధ్య వచ్చిన అజిత్ రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. నిజానికి సంక్రాంతి బరిలోనే రావాల్సిన ఈ సినిమాను సడెన్ గా పోస్ట్ పోన్ చేశారు. కాకపోతే త్వరగానే కొత్త రిలీజ్ డేట్ వేశారు. బ్రేక్ డౌన్ అనే హాలీవుడ్ మూవీకి ఇది కాపీ. ఈ విషయం ఆ నిర్మాణ సంస్థకు తెలిసి కేస్ వేస్తాం అని చెప్పారు. ఈ లోగా చాలా విమర్శలే వచ్చాయి. దీంతో రీమేక్ రైట్స్ తీసుకున్నారు.
ఇక తెలుగులో ఈ చిత్రం గురించి కనీస ప్రచారం కూడా కనిపించడం లేదు. ఆ మూవీలో నటించిన ఇతర ఆర్టిస్ట్ లతో అయినా ఇంటర్వ్యూస్ చేయిస్తే బావుంటుంది అనుకుంటే.. అజిత్, త్రిష తప్ప ఇంకెవరూ తెలిసిన వాళ్లు కనిపించడం లేదు. దీంతో మరో రెండు రోజుల్లోనే విడుదల కాబోతోన్న పట్టుదల గురించి జనాలకు అస్సలు తెలియనే లేదు అంటే అతిశయోక్తికాదు. అజిత్ కు ఇక్కడ హార్డ్ కోర్ ఫ్యాన్సేం లేరు. అలాగని ఏ ప్రమోషన్స్ చేయకపోయినా ఓపెనింగ్స్ తెచ్చేంత క్రేజ్ కూడా లేదు. దీంతో పట్టుదలను తెలుగులో పట్టించుకునే వారే లేరా అని ఆ ఉన్న కొద్ది మంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా కంటెంట్ బావుందని తెలిస్తే ఆటోమేటిక్ గా టికెట్స్ తెగుతుంటాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com