Priyadarshi : సారంగపాణిగా ప్రియదర్శి సత్తా చాటతాడా

కథా బలం ఉన్న చిత్రాల్లో కథానాయకుడుగా నటిస్తూ మంచి విజయాలు సాధిస్తున్నాడు ప్రియదర్శి పులికొండ. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ, కమెడియన్ గానూ ఆకట్టుకుంటున్నాడు. బలగం తర్వాత కోర్ట్ మూవీతో 50 కోట్ల క్లబ్ లో చేరిన ప్రియదర్శి ఇప్పుడు సారంగపాణి జాతకంతో వస్తున్నాడు. సెన్సిబుల్ మూవీ మేకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఆంధ్ర ప్రాంతంలో కొన్ని చోట్ల ప్రీమియర్స్ కూడా వేశారు. రూపా కొడువయూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నరేష్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, శ్రీనివాస్ అవసరాల ఇతర కీలక పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఒక వైవిధ్యమైన కథ చూడబోతున్నాం అనే ఫీలింగ్ తెచ్చాయి. అంటే ఇంద్రగంటి తరహాలో జాతకాలు, వాటిపై పిచ్చి ఉన్నవారిపై సెటైరికల్ గా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ తరహా కథలకు కథనమే బలం. కామెడీ అదనంగా కలిసొస్తుంది. ఈ రెండూ సినిమాలో ఉన్నాయి అనేలా ఉంది ఇప్పటి వరకూ కనిపిస్తోన్న ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే.
ప్రమోషన్స్ పరంగా మొత్తం టీమ్ చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది. కంటెంట్ పై వారి నమ్మకం ప్రమోషన్స్ లో కనిపిస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ సమ్మోహనంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన ‘వి’, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు బాగా నిరుత్సాహపరిచాయి. కాస్త గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం ఈ సారంగపాణి జాతకం. అందుకే ఈ మూవీపై అతనూ హోప్స్ పెట్టుకున్నాడు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. సమ్మోహనం కూడా ఇదే బ్యానర్ లో రూపొందింది.
సారంగపాణి జాతకంతో ప్రియదర్శి హాట్రిక్ కొట్టలేడేమో.. ఎందుకంటే బలగం తర్వాత చేసిన డార్లింగ్ మూవీ డిజాస్టర్ అయింది. మళ్లీ కోర్ట్ తో హిట్ అందుకున్నాడు. డార్లింగ్ హిట్ అయి ఉంటే కోర్ట్ తో హ్యాట్రిక్ వచ్చేది. మొత్తంగా సారంగపాణి జాతకం నిర్మాతతో పాటు, దర్శకుడికీ మంచి విజయం ఇవ్వాల్సి ఉందిప్పుడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com