Ram Charan : పుష్ప 2 అయింది.. ఇక చరణ్ గేమ్ మొదలవుతుందా..?

పుష్ప 2... దేశవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఓ రకంగా చెబితే రెండు వారాలుగా టాలీవుడ్ లో పుష్ప 2 గురించి తప్ప వేరే పెద్ద సినిమా ఊసే కనిపించడం లేదు. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టాడు పుష్ప రాజ్. అయితే ఈ మూవీ తర్వాత రాబోతోన్న మరో పెద్ద సినిమా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్. జనవరి 10న విడుదల కాబోతోన్న ఈ మూవీని శంకర్ డైరెక్ట్ చేశాడు. ఇప్పటి వరకూ పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. అయినా త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ముందు ఓవర్శీస్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు వీళ్లు. ఈ క్రమంలో ఈ నెల 21న యూఎస్ లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పుష్పరాజ్ క్రియేటర్ ను పిలుస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది.
గేమ్ ఛేంజర్ యూఎస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా సుకుమార్ ను రప్పిస్తున్నారు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. సుకుమార్ కు రామ్ చరణ్ కు మధ్య బాండింగ్ ఉంది. చరణ్ కెరీర్ బెస్ట్ హిట్ రంగస్థలం ఇచ్చింది సుకుమారే కదా. అలాగే ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్ లోనే సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ కారణంగా అతన్ని రప్పించాలనుకుంటున్నారు. అది పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత జరుగుతోంది కాబట్టి.. అక్కడ సుకుమార్ క్రేజ్ కూడా యాడ్ అవతుందనేది మేకర్స్ ఆలోచన అనుకోవచ్చు. అయితే ఇదే విషయంలో సుకుమార్ ను పిలవకపోవచ్చు అనే చర్చ కూడా ఉంది.
గేమ్ ఛేంజర్ పై ఫ్యాన్స్ లో కూడా పెద్దగా ఆశలు కనిపించడం లేదు. అయినా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు జనవరి 4న రాజమండ్రిలో నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో బజ్ క్రియేట్ అవుతుందనుకుంటున్నారు. పైగా రాజమండ్రి ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. అది ఖచ్చితంగా మూవీకి పెద్ద ఊపు తెస్తుందనే చెప్పాలి. అయితే ఈ లోగానే వీలైనన్ని ఎక్కువ ప్రమోషన్స్ ప్లాన్ చేయాలి. గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కు న్యాయం జరగాలంటే పుష్ప ను దాటకపోయినా ఫర్వాలేదు కానీ.. ధీటుగా కనిపించాలి అంతే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com