Nani : ఈ శనివారంతో నాని కోరిక నెరవేరుతుందా..

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకుడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. ఎస్.జే సూర్య విలన్ గా నటించాడు. ఈ నెల 29న విడుదల కాబోతోందీ మూవీ. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోన్న సరిపోదా శనివారంపై నాని చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇప్పటి వరకూ నేచురల్ స్టార్ గా, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరెట్ హీరోగా ఉన్నాడు నాని. అయితే ఈ ఇమేజ్ ను మార్చుకోవాలని కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కంప్లీట్ మాస్ హీరోగా మారాలనేలా కథలు ఎంచుకుంటున్నాడు. శ్యామ్ సింగరాయ్ లాంటి కథకు అతని స్టేచర్ సరిపోలేదు అనేది నిజం. తర్వాత దసరాతో ఆకట్టుకోవాలని చూసినా ఇది ప్యాన్ ఇండియా స్థాయిలో డిజాస్టర్ అయింది. అలాగే నానిని అలా చూడ్డానికి ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇబ్బంది పడ్డారు అనేదీ నిజం. ఎలా చూసినా మాస్ హీరో లక్షణాలు నానిలో కనిపించవు. ఇమేజ్ పరంగా చూసినా, కటౌట్ పరంగా చూసినా అతను పూర్తి స్థాయిలో మాస్ హీరో అనిపించుకోవడం అనేది సాధ్యమా అంటే డౌటే అని చెప్పాలి.
ఈ క్రమంలో సరిపోదా శనివారంతో మరోసారి మాస్ ను మెప్పించాలని చూస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే కాస్త డిఫరెంట్ గా ఉంది. కానీ శనివారం మాత్రమే రివెంజ్ తీర్చుకునే హీరోఅనే కాన్సెప్ట్ మాత్రం తేడాగా కనిపించింది. ఇలాంటివి మాస్ ను మెప్పించలేవు. మాస్ హీరో అంటే ఇన్ స్టంట్ రియాక్ట్ కావాలని కోరుకుంటారు ప్రేక్షకులు. అయితే ఈ మూవీ ట్రైలర్ లో కనిపించని సర్ ప్రైజింగ్ లు సినిమాలో చాలా ఉంటాయంటున్నారు. అందులో ప్రధానంగా కనిపించేది ప్రియాంక మోహన్ పాత్ర వెరీ సర్ ప్రైజింగ్ గా ఉంటుందంటున్నారు. ఈ పాత్ర ద్వారా దర్శకుడు ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు అనేది ఎక్కువగా చెప్పుకుంటున్నారు. అప్పుడు హీరో రేంజ్ తగ్గుతుంది కదా అనే డౌట్ వస్తే తప్పేం లేదు. మరోవైపు విలన్ గా ఎస్.జే సూర్య ఎగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. ఆ క్యారెక్టర్ ను మ్యాచ్ చేసేలా నాని క్యారెక్టరైజేషన్ ను ట్రైలర్ లో చూపించలేదు దర్శకుడు. ఏదేమైనా ఆగస్ట్ ను సరిపోదా శనివారం గ్రాండ్ గా ఎండ్ చేస్తుందనే టాక్ ఉంది. అది జరిగితే నాని కోరుకునే మాస్ ఇమేజ్ కు దగ్గరవుతాడు. మాస్ ఆడియన్స్ ను మెప్పిస్తాడు. లేదంటే మరో సినిమా వరకూ చూడాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com