Shekhar Kammula : శేఖర్ కమ్ముల ఫిలాసఫీ ప్రేక్షకులకు ఎక్కుతుందా..?

Shekhar Kammula :  శేఖర్ కమ్ముల ఫిలాసఫీ ప్రేక్షకులకు ఎక్కుతుందా..?
X

సినిమాల్లో సందేశం ఉంటే ఎవరు చూస్తారు అనే రోజులు వచ్చి చాలా యేళ్లైంది. ఇప్పుడంతా వినోదమే కావాలి. లేదా హారర్, థ్రిల్లర్.. ఇలా డిఫరెంట్ ఫీలింగ్స్ ను ఇచ్చే కంటెంట్ కావాలనుకుంటున్నారు. ఈ టైమ్ లో వెండితెరపై ఫిలాసఫీ చెబితే వర్కవుట్ అవుతుందా..? అనేది పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం దొరకదు అని చెప్పలేం. ఆ ఫిలాసఫీని జనరంజకంగా చెప్పగలిగితే వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయి. శేఖర్ కమ్ముల సినిమా అంటే అనేక సెన్సిబిలిటీస్ ఉంటాయి. కంటెంట్ పరంగా, కథనం పరంగా కూడా ఆయనకంటూ సెపరేట్ స్టైల్ ఉంది. ఎవరినీ డీ గ్రేడ్ చేయడు. హీరోయిన్లతో ఎక్స్ పోజింగ్ అనే మాటే ఉండదు. ఇక ఫస్ట్ టైమ్ స్టార్స్ తో వర్క్ చేసిన కుబేర ఈ 20న విడుదలవుతోంది. ఈ ట్రైలర్ చూస్తే శేఖర్ కమ్ముల తన ఫిలాసఫీని చెప్పబోతున్నాడు అనిపించేలా ఉంది.

విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు కథ అందించింది లిరిసిస్ట్ కూడా అయిన పింగళి చైతన్య. చైతన్య నేపథ్యం ఈ తరానికి తెలియకపోవచ్చు. కానీ ఆమె తండ్రి 1980ల కాలంలో ‘ఎన్ కౌంటర్’అనే పత్రికను స్థాపించి నాటి ప్రభుత్వ, ప్రతిపక్షాలను తన నిఖార్సైన రాతలతో వణికించిన పింగళి దశరథరామ్. తెలుగు జర్నలిజంలో ఒక గొప్ప అధ్యాయంగా ఎన్ కౌంటర్ పత్రికను, దశరథరామ్ ను ను చెప్పుకుంటారు. తన రాతలతో వణికిపోయిన నాటి నేతలే ఆయన్ని హత్య చేయించారు అంటారు. అలాంటి కలం యోధుడి కూతురు రాసిన కథ కాబట్టి ఆ అగ్నికణాలు ఈ కథలోనూ కనిపించే అవకాశం ఉంది. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శేఖర్ కమ్ముల ముందుగా ఈమె పేరే చెప్పాడు. ఆమెకే కృతజ్ఞతలు చెప్పాడు.

మనిషుల మధ్య అంతరం ఉండకూడదు. ఏ మనిషీ మరో మనిషికి తక్కువ కాదు. సామాజిక, ఆర్థిక అంతరాలు ఉండకూడదు అని బలంగా నమ్ముతాడు శేఖర్ కమ్ముల. ఆ నమ్మకమే అతని అనేక సినిమాల్లో ప్రతిబింబిస్తుంది. అందుకు అతని లాస్ట్ మూవీ లవ్ స్టోరీ ఓ ఉదాహరణ. ఈ సారి స్టార్స్ తో తన ఫిలాసఫీని మరింత బలంగా చెప్పబోతున్నాడు అనిపించేలా కనిపిస్తోంది. మరి ఈ ఫిలాసఫీకి తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Tags

Next Story