Thangalaan Movie : విక్రమ్ .. ఈ సారైనా కొడతాడా ..

Thangalaan Movie : విక్రమ్ .. ఈ సారైనా కొడతాడా ..
X

ఇండియాలోని మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఖచ్చితంగా ఉంటాడు విక్రమ్. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన నటుడు విక్రమ్. తనకంటూ పెద్ద స్టార్డమ్ వచ్చినా.. ప్రయోగం అంటే చాలు ముందుంటాడు. మేకప్ పరంగా కమల్ హాసన్ తర్వాత అన్ని ప్రయోగాలు చేసింది విక్రమ్ అంటే అతిశయోక్తి కాదు. అయితే కొన్నాళ్లుగా విక్రమ్ కు సరైన హిట్ పడటం లేదు. కథలు మార్చాడు. మేకప్ లు మార్చాడు. అయినా విజయం రావడం లేదు. ఖచ్చితంగా చెబితే అపరిచితుడు తర్వాత ఆ స్థాయి బ్లాక్ బస్టర్ పడలేదు ఇంత వరకు. మధ్యలో కొన్ని హిట్స్ ఉన్నాయి. అవేవీ అతని స్థాయి హిట్స్ కాదు. కాకపోతే నిర్మాతలు మరీ దారుణంగా లాస్ అయిన సందర్భాలు తక్కువ.

ఇక ఇప్పుడు మరోసారి తనకే సొంతమైన మేకప్ మ్యాజిక్ తో తంగలాన్ అంటూ వస్తున్నాడు. పా. రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే కథ. ఆ రోజుల్లో కోలార్ గోల్డ్ ఫీల్డ్ ( కేజీఎఫ్ ) చుట్టూ ఉన్న కొన్ని తెగలు ఆ బంగారు గనులను ఎలా కాపాడుకున్నారు అనే కోణంలో ఈ కథ చెప్పాడట రంజిత్. విక్రమ్ ఈ మూవీ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఎంత అంటే ఇప్పటి వరకూ పా. రంజిత్ తీసిన సినిమాలన్నీ ఒకెత్తు.. ఇది ఒకెత్తు అన్నట్టుగా చెబుతున్నాడు. అందుకే ప్రమోషన్స్ కూడా స్ట్రాంగ్ గా చేస్తున్నాడు. కంటెంట్ పరంగా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ట్రైలర్స్ తర్వాత ప్రేక్షకుల్లో అంచనాలు కూడా బాగా పెరిగాయి.

విక్రమ్ తో పాట పార్వతి, మాళవిక మోహనన్, పశుపతి కీలక పాత్రలు చేస్తున్నారు. జివీ ప్రకాష్ కుమార్ సంగీతం హైలెట్ గా నిలుస్తుందని ఇప్పటి వరకూ వచ్చిన పాటలు చూస్తే అర్థం అవుతుంది.

ఇక ఈసినిమా కోసం మేకప్ విషయంలో విక్రమ్ చాలా కష్టాలే ఎదుర్కొన్నాడని తెలుస్తోంది. ఆ మేకప్ కోసం గంటల తరబడి ఒకే చోట కూర్చుని ఉండటం.. అలాగే రకరకాల రూపాల్లో కనిపించడం.. మొహంతో పాటు ఒళ్లంతా రంగులు పులుముకోవడం.. ఇలాంటివి చూస్తుంటే అతను ఈ పాత్రను ఎంత ఓన్ చేసుకున్నాడో.. ఎంత హార్డ్ వర్క్ చేశాడో అర్థం అవుతుంది. మరి ఈ సారైనా అతని కష్టం ఫలించి ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ గా తంగలాన్ నిలుస్తుందేమో చూడాలి.

Tags

Next Story