Tollywood Strike : టాలీవుడ్ లో మళ్లీ కార్మికుల సమ్మె

తెలుగు సినిమా పరిశ్రమ మళ్లీ సమ్మె బాట పట్టబోతోందా అంటే అవుననే అంటున్నారు. అది కూడా ఈ ఆగస్ట్ 1 నుంచే మొదలవుతుందంటున్నారు. ఈ సమ్మెకు కారణం కార్మికుల వేతనాలు కావడం గమనార్హం. గతంలో ప్రతి మూడేళ్లకు ఒకసారి 30 శాతం వేతనాలు పెంచాలి అనే నిబంధనను పెట్టుకున్నారు. ఆ నిబంధన ప్రకారం జూన్ 30నే ఆ తేదీ ముగిసింది. అంటే గడువు ముగిసిపోయి నెల రోజులు అవుతోంది. ఈ సందర్భంగా ఈ 29న ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు, ముఖ్యుల మధ్య చర్చలు నడిచాయి. అయితే వేతనాల పెంపుకు ఛాంబర్ లో అంగీకరించలేదు. ఒకవేళ ఒప్పుకున్నా కేవలం 5శాతం మాత్రమే పెంచుతాం అని చెప్పారట. దీంతో చర్చలు విఫలం అయ్యాయి.
ఫిల్మ్ ఫెడరేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ 5శాతం పెంపుదలకు అంగీకరించం అని తెగేసి చెప్పారు. ఖచ్చితంగా ముందు నిర్ణయించుకున్న ప్రకారం 30శాతం పెంచాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే విషయం పై మరోసారి (జూలై 31న ఉదయం) మరోసారి కార్మిక సంఘాలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు కార్మిక భవన్ లో చర్చలు జరపబోతున్నారు. ఇక్కడ కూడా వేతనాల పెంపు వ్యవహారం సెటిల్ కాకపోతే ఆగస్ట్ 1 నుంచి సమ్మెకు దిగుతాం అని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఒకవేళ ఎవరైనా 30 శాతం పెంచి ఇస్తాం అని చెబితే వారి షూటింగ్స్ కు హాజరవుతాం అని కూడా తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com