Vijaya Rangaraju : ఎవరీ విజయరంగరాజు

తెలుగు సినిమా పరిశ్రమ ఓ నటుడిని కోల్పోయింది. ఇప్పటి వరకూ విలన్ పాత్రల్లో ఆకట్టుకున్న విజయ రంగరాజు మరణించారు. ఆయన అసలు పేరు రాజ్ కుమార్. ఆయన తెలుగులో ఎంట్రీ ఇచ్చే నాటికి రాజ్ కుమార్ పేరుతో ఓ నటుడు ఉన్నాడు. అటు కన్నడ పరిశ్రమలో ఆ పేరు తెలియనివాళ్లే లేరు. అందుకే తన పేరును విజయరంగరాజుగా మార్చుకున్నారు. ఈయన నటించిన తొలి సినిమా ‘భైరవద్వీపం’. సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ హీరో. ఆ సినిమాలో భయంకరమైన మాంత్రికుడు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఎవరీ విలన్ మాంత్రికుడు అంటూ అంతా ఒకటే మాట్లాడుకున్నారు. ఆ స్థాయిలో ఇంపాక్ట్ వేసిందా పాత్ర. ఆ తర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ రాణించారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల చిత్రాల్లోనూ నటించి మెప్పించారు.
విజయ రంగరాజు విలన్ గా బలమైన ఇంపాక్ట్ వేసిన తెలుగు సినిమా యజ్ఞం. గోపీచంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మరో కన్నడ నటుడు దేవరాజ్ తో కలిసి చేసిన విలనీ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఆ స్థాయి విలనీ ఉన్న పాత్రలు రాలేదు అనే చెప్పాలి.
కొన్నాళ్ల క్రితం కన్నడ ప్రజల ఆరాధ్య నటుడు అయిన విష్ణువర్ధన్ పై అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు విజయ రంగరాజు. దీంతో అతనిపై కన్నడ పరిశ్రమ మొత్తం భగ్గుమంది. ఆపై క్షమాపణలుచెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.
ఇక ప్రస్తుతం ఓ సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన గాయపడ్డాడు. ఆ గాయానికి చికిత్స కోసం చెన్నై వెళ్లారు. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే గుండెపోటు రావడంతో మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నటుడు కాక ముందు ఆయన వెయిట్ లిఫ్టర్, బాడీ బిల్డింగ్ కూడా చేశారు. మొత్తంగా టాలీవుడ్ ఓ మంచి విలన్ పాత్రధారిని కోల్పోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com